protest for rehabilitation at polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాల ప్రజలు సర్వస్వం త్యాగం చేశారు. రాష్ట్రం సస్యశ్యామలం అయితే చూసి మురిసిపోవాలనుకున్నారు. అందుకోసం తరతరాల వారసత్వంగా సంక్రమించిన ఇళ్లు, పొలాలను ప్రభుత్వానికి అప్పగించి.. నిరాశ్రయులుగా మిగిలారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వకపోవడం.. పునరావాస ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కరించడం లేదంటూ నిర్వాసిత గ్రామాల ప్రజలు ఈ నెల 10 నుంచి నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్నారు.
ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని 72 గ్రామాల నుంచి 11,433 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలవరం మండలంలో 2,482 కుటుంబాలు స్వచ్ఛందంగా బయటకు వచ్చాయి. కొరుటూరు, సిరివాక, శివగిరి, చీడూరు, గాజులగొంది, పెద్దూరు గ్రామాల పరిధిలోని 716 కుటుంబాలు ముంపు ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాయి. మూడు మండలాల్లో 9,609 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. వీరిలో 1,348 గిరిజన కుటుంబాలు, 11 గిరిజనేతర కుటుంబాలకు మాత్రమే రూ.92.83 కోట్ల సొమ్ము జమైంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటి వరకూ ఒక్క కుటుంబానికీ పరిహారం జమ కాలేదు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచింది. మూడేళ్లు గడిచినా ఒక్క కుటుంబానికి కూడా పెరిగిన మొత్తం అందలేదు. పోలవరం మండలం చీడూరుకు చెందిన సంకురు ప్రసాదరెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కౌలుకు అయిదెకరాలు సాగు చేసేవారు. పెట్ట్టుబడి ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలేది. ప్రాజెక్టు కారణంగా వ్యవసాయ భూములు లేక.. కూలి పనులూ దొరక్క కుటుంబపోషణకు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి వారు నిర్వాసితుల్లో వందలాది మంది ఉన్నారు.
పునరావాసానికి ఇంకెన్నాళ్లు?
ప్రాజెక్టు నిర్వాసితుల కోసం.. పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో పునరావాస కాలనీల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటివరకు ఒక్క కాలనీలోనూ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. చాలా మంది నిర్వాసితులు బయట అద్దెలు చెల్లించే స్థోమత లేక.. అరకొర సౌకర్యాలున్న కాలనీల్లోనే బతుకుతున్నారు. పోలవరం మండలం గాజులగొంది పునరావాస కాలనీల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. బయటకు వచ్చిన నిర్వాసితులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
వారం రోజుల్లో జమవుతాయి
పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇంకా అందలేదన్నది వాస్తవమే. ఇప్పటి వరకు పోలవరం మండలంలో కొందరికి చెల్లించాం. మిగిలినవారికి వారంలో సొమ్ము జమవుతుంది. వేలేరుపాడు, కుక్కునూరు నిర్వాసితుల పరిహారం గురించి త్వరలో బిల్లులు పెడతాం. పునరావాస కాలనీల నిర్మాణం చాలా వరకు పూర్తయింది. త్వరలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. భూమికి భూమి ఇచ్చిన చోట లబ్ధిదారులకు ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తాం.
- ఒ.ఆనంద్, పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి
ఏడు నెలలుగా చీకట్లోనే..