ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

polavaram: పోలవరం వరద కష్టాలు.. గ్రామాలను వదిలిపోతున్న నిర్వాసితులు

వరద భయంతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు బతుకుజీవుడా అంటూ... పెట్టేబేడా.. గొడ్డుగోదాతో గ్రామాలను వదులుతున్నారు. అన్నీ పోగొట్టుకొని.. కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడ్డా.... అధికారులు మాత్రం కనికరం చూపించట్లేదు. వారికి కనీసం పునరావాసం కల్పించకపోయినా... ప్రభుత్వం బలవంతంగా గ్రామాలు ఖాళీ చేయిస్తోంది.

polavaram news
polavaram news

By

Published : Aug 1, 2021, 11:09 AM IST

పోలవరం వరద కష్టాలు.. గ్రామాలను వదిలిపోతున్న నిర్వాసితులు

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు వరద ఉద్ధృతి పెరిగింది. కాపర్ డ్యాం నిర్మాణంతో గోదావరికి చిన్న వరదొచ్చినా.. ముంపు గ్రామాలు జలదిగ్బంధమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పదుల సంఖ్యలో ముంపు గ్రామాలు వరద తాకిడితో అతలాకుతలం అవుతున్నాయి. ఓ వైపు వరద.. మరో వైపు ఖాళీ చేయమని అధికారులు బెదిరింపులతో బిక్కుబిక్కుమంటూ రిక్తహస్తాలతో గ్రామాల నుంచి వెళ్లిపోతున్నారు. వారికి అందించాల్సిన పునరావాస ప్యాకేజీలు అందించడంలో ప్రభుత్వం మీనమాసాలు లెక్కేస్తోంది. పునరావాసం, పరిహార ప్రక్రియలు చేపడతారా లేదా.. అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది.

జిల్లాలో పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. కాపర్ డ్యాం నిర్మాణంతో చిన్న వరదకే గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. ప్రభుత్వం నిర్వాసిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ప్యాకేజీ.... ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పినా.. మళ్లీ ఆ ఊసే ఎత్తడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

అధికారులకు తెలిసినా..

ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం పూర్తైంది. జులై నుంచి వరద వస్తే గ్రామాలను ముంచెత్తుతుందని అధికారులకు తెలిసినా.. మిన్నకుండిపోయారు. ఎలాంటి పునరావాసం లేకుండానే.. గ్రామాలను ఖాళీ చేసే ప్రణాళికలు సిద్ధంచేశారు. నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై మాత్రం ఎలాంటి ప్రణాళిక చేపట్టలేదు. తాత్కాలిక పునరావాస కాలనీల్లోనూ ఎలాంటి సదుపాయలు కల్పించలేదు. కనీసం కూరగాయలు, నిత్యావసరాలు సరఫరా చేయలేదు. ఉన్న గ్రామాన్ని వదిలి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు.

అధికారులు పునరావాసం, పరిహారం అందించి.. గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్వాసితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కర్నూలులో చెక్‌పోస్ట్ వద్ద రూ.90 లక్షలు పట్టివేత

ABOUT THE AUTHOR

...view details