పోలవరం పునరావాసం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు అక్షరాలా అద్దం పట్దే దృశ్యం ఇది. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్న ఈ కాలనీలో ఎటు చూసినా మొండి స్తంభాలే కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి కాలనీ దుస్థితి ఇది. పోలవరం పునరావాస కాలనీల్లో ఇదో పెద్ద కాలనీ కావడం గమనార్హం. ఇక్కడ మొత్తం 4,027 ఇళ్లు నిర్మించాలనేది ప్రణాళిక. ఇదొక్కటే కాదు. చాలా వరకు పోలవరం పునరావాస కాలనీల్లో ఇళ్లు పూర్తి కాలేదు. ఆగస్టు నాటికి 20 వేల కుటుంబాలను తరలించాలనే లక్ష్యానికి ఇంకా అమడ దూరంలోనే క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయి.
పోలవరం పునరావాస అధికారుల ప్రణాళిక ప్రకారం మొత్తం 16,294 కుటుంబాలను తరలించాల్సి ఉంది. జులై నెలాఖరుకు 7,225 కుటుంబాలను, ఆగస్టులో 9,069 కుటుంబాలను తరలిస్తామని కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు, రాష్ట్ర ముఖ్యులకు కూడా పునరావాస అధికారులు నివేదికలు సమర్పిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు ఈ తరలింపు ప్రణాళికల గడువు వేరే ఉండేది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్షల సమయంలో జూన్ నెల ప్రారంభానికే నిర్వాసితుల తరలింపు పూర్తి అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మొండి స్తంభాల స్థాయిలోనే కాలనీలు ఉంటే అసలు తరలింపు ప్రణాళిక సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది.
స్నానాల గదులకు చీరలే అడ్డు!
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పెదభీంపల్లి పునరావాస కాలనీలో వరుసగా స్నానాల గదులు నిర్మించారు. ఇప్పటికీ వీటికి తలుపులు ఏర్పాటు చేయలేదు. ఆ గదులకు చీరలో, తెరలో అడ్డుగా పెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ కాలనీలకు వచ్చిన మహిళలు ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. అంతో ఇంతో పూర్తయిన కాలనీలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తవలేదు. ఇతరత్రా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. కిందటి ఏడాది రూ.5,000 అద్దెకు రంపచోడవరంలో నివాసం ఉన్నామని, ఇప్పుడు ఆ అద్దెను భరించలేకనే కాలనీకి వచ్చేసినట్లు నడిపూడి శివజ్యోతి చెప్పారు. ఆమె ఈ కాలనీలోకి కుటుంబంతో సహా వచ్చారు. ఇంకా పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదని అంటున్నారు.
ఇళ్లల్లోకి వచ్చిన తర్వాత సున్నం
దేవీపట్నం మండలం పునరావాస కాలనీలోని ఇళ్లలోకి కొందరు నిర్వాసితులు వచ్చేశారు. ఇంకా పనులు పూర్తి చేయకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిల్లో చేరారు. ఇప్పుడు ఆ ఇళ్లకు గుత్తేదారు సున్నం వేయిస్తుండటంతో అందరూ మళ్లీ సామాన్లను బయటకు తీసుకువచ్చారు. అసలే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఇదో ఇబ్బంది అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఊరు ముంపులో ఉందా? మాకు ప్యాకేజీ ఇస్తారా?
దేవీపట్నం మండలం కె.వీరవరం గ్రామస్థులు వీరు. గోదావరి వరదతో దండంగి వాగు ఉప్పొంగి ఊరిని ముంచెత్తుతోంది. ఎప్పుడో మాకు పట్టాలు ఇచ్చారు. ఇప్పటికీ ఆ భూములు ఎక్కడ ఉన్నాయో చూపించలేదు. పునరావాస ప్యాకేజీ ఊసే లేదు. ఏ అధికారి వచ్చి ఏమీ చెప్పడం లేదు. ఈ గ్రామం ముంపులో లేదని కొందరంటున్నారు. కిందటేడాది వరదతో ఇబ్బందులు పడ్డాం. ఊళ్లోకి నీరు వస్తోంది. అద్దెలకు వెళ్దామంటే కూలీ చేసుకుని బతికేవాళ్లం. ఏం చేయగలం’’ అని ప్రశ్నిస్తున్నారు.
*ఎ.వీరవరం గ్రామస్థులది మరో బాధ. 2009లో ఆ ఊరి వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.55 లక్షలు ఇస్తామన్నారు. అందుకు ఆ ఊరి వారు అంగీకరించారు. అప్పట్లో కుటుంబానికి రూ.90 వేల చొప్పున ఇచ్చారు. మిగిలిన సొమ్ములు ఇవ్వకపోడంతో ఊరు ఖాళీ చేయలేదు. ఇప్పుడు 2013 చట్టం కింద తమకు పరిహారం ఇవ్వాలని ఆ ఊరి వారు కోరుతున్నారు.