నలభై రెండు రోజుల ఉత్కంఠకు తెరపడే సమయం దగ్గరపడింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తెలిసే ఘడియ వచ్చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
మూడు కేంద్రాల్లో లెక్కింపు
ఓట్ల లెక్కింపునకు భీమవరం, ఏలూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఏలూరులోని సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి అసెంబ్లీ స్థానాలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.