రాష్ట్రంలో 3 నెలల పాటు ఇసుక రవాణాపై నిషేధం విధించిన ప్రభుత్వం... నూతన పాలసీని తీసుకొచ్చింది. దీని వల్ల ప్రజల కష్టాలు తీరుతాయని భావించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. నూతన విధానం అమలై నెలరోజులు గడుస్తున్నా... ఇసుక నేటికీ సామాన్యునికి అందని ద్రాక్షలానే మారింది. గోదావరి నదికి ఆనుకుని ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ దుస్థితి నెలకొంది.
దళారుల దందా
జిల్లాలో ఇసుక సరఫరాలో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బల్క్‌గా ఇసుకను బుక్ చేస్తూ నల్లబజారుకు తరలిస్తున్నారు. సర్కారు లెక్కల ప్రకారం 20 టన్నుల ఇసుక రూ.19,500 రూపాయలకు ప్రజలకు అందాల్సి ఉండగా... ప్రస్తుతం రూ.45 వేలకు చేరుకుంది. ఆన్లైన్ విధానంలో ఇసుక లభించకపోవడం వల్ల కొంతమంది నల్లబజారును ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ పాలసీ వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 టన్నుల లారీ రూ.19,500 కు లబ్ధిదారుని ఇంటికి చేరాల్సి ఉండగా... ఇప్పుడు రూ.45 వేలు వెచ్చించినా అందడం లేదు. అదృష్టం కొద్దీ ఆన్లైన్లో బుక్ అయినా దాదాపు రూ.12 వేలు మామూళ్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు.