సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా రాష్ట్రంలో దేవాలయాలను మూసివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు.. గ్రహణ పట్టు స్నానాలు చేశారు..
సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు మూతపడ్డాయి. గ్రహణం విడిచిన తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి భక్తులను అనుమతించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన తణుకులోని సూర్యదేవాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ కేశవ స్వామి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, మండపాక ఎల్లారమ్మ ఆలయం, దువ్వ గ్రామంలో దానేశ్వరి అమ్మవారి ఆలయం, మూతపడ్డాయి.
ఉండ్రాజవరంలో
ఉండ్రాజవరంలోని శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయం, శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉండ్రాజవరంలోని మహిళలు ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు. గ్రహణ ప్రారంభ సమయం నుంచి ప్రయత్నించగా గ్రహణ సమయం ప్రారంభం రాగానే రోకలి నిలబడింది. గ్రహణ సమయం ముగిసే వరకు రోకలి నిలబడే ఉంది.
ద్వారకా తిరుమల
ద్వారకా తిరుమల కుంకుళ్లమ్మ ఆలయ అర్చకులు భైరవ ఇంటి వద్ద ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు. గ్రహణ ఉన్నంత సేపు రోకలి నిలబడింది. చుట్టుపక్కల వారు సైతం అక్కడి చేరుకుని తిలకించారు. మామూలు సమయంలో రోకలిబండ నిలబెడితే నిలబడదు. ఈ గ్రహణ కాలం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే రోకలిబండ నిలబడుతుందని భైరవ స్వామి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రమణయ్యపేటలో మహిళలు ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు. గ్రహణ సమయం విడిచే వరకు కూడా అలా నిటారుగానే ఉంది. ఈ పురాతన ఆచారాన్ని తిలికించడానికి చుట్టు పక్కల గ్రామాల వాళ్లు అధిక సంఖ్యలో వచ్చారు.
రాజమహేంద్రవరంలో
గోదావరి తీరంలో సూర్యగ్రహణ ప్రారంభవేళ గ్రహణం పట్టు స్నానాలను భక్తులు ఆచరించారు. కరోనా ప్రభావంతో రాజమహేంద్రవరంలో గోదావరి ఘాట్లు మూసివేశారు. మార్కండేయస్వామి గుడి వద్ద ఘాట్‌లో అవకాశం ఉండటంతో పట్టుస్నానాలు ఆచరించారు. గ్రహణం సందర్బంగా పట్టు, విడుపు స్నానాలు చేయడం గోదావరి తీరంలో ఆనవాయితీ. కరోనా ప్రభావంతో రద్దీ పూర్తిగా తగ్గింది. నగరపాలక సంస్థ సిబ్బంది, పోలీసులు అనంతరం అన్ని ఘాట్ల నుంచి వారిని పంపించివేశారు.
గ్రహణం సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో నీళ్లతో నిండిన పళ్లెంలో రోకలిని ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా నీళ్లతో ఉన్న పళ్లెంలో రోకలి నిలబడదని, గ్రహణం సమయంలోనే ఇలా జరుగుతుందని, అలా నిలబడిన రోకలికి పూజలు చేస్తే దోషాలు పోతాయని ప్రజల విశ్వాసం. కృష్ణాజిల్లా తిరువూరులో మహిళలు పళ్లాల్లో నీళ్లు పోసి రోకళ్లను నిలబెట్టారు. అయితే జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు మాత్రం ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేస్తున్నారు.. సాధారణ రోజుల్లో కూడా ఒక క్రమపద్ధతిలో పెడితే రోకళ్లు నిలబడతాయని జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరికృష్ణ తెలిపారు...
మోపిదేవిలో
దివిసీమ మోపిదేవి గ్రామంలో గ్రహణం విడిచిన తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించి భక్తులను అనుమతించనున్నారు. ప్రజలు నేలపై రోకలిని నిలబెట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సూర్యగ్రహణం సందర్భంగా ఇత్తడి పల్లెంలో రోకలి నిటారుగా నిలిచింది. వాటికి పసుపు తాళ్లు కట్టి పూజలు చేశారు.
సూర్య గ్రహణం సందర్భంగా కర్నూలులోని దేవాలయాలు ముసివేసినా స్థానిక సూర్యదేవాలయంలో ప్రత్యేకంగా హోమాలు నిర్వహించారు. సూర్యగ్రహణం సందర్భంగా సూర్యుడికి శక్తి రావాలని రాహుకేతువుల హోమం నిర్వహించినట్లు వేదపండితులు తెలిపారు. కరోనా తొలగిపోవాలని ప్రత్యేకంగా పుజలు చేశారు.
సూర్యగ్రహణం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో పట్టణ వాసులు ఇంట్లోనే పూజలు నిర్వహించారు.. ఉదయం 10.14 నిముషాలకు ప్రారంభంకాగానే తమ ఇష్ట దైవాలకు పూజలు చేశారు. మహిళలు లలిత, విష్ణుసహస్త్రనామాలు, గోవిందనామాలు పారాయణం చేశారు. మహిళలు ఇత్తడి పళ్లెంలో రోకలిని నిలబెట్టారు.
గ్రహణ సమయంలో గ్రామాలలో రోకళ్లను పోటా పోటీగా నిలబెట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రహణ సమయంలో రోకళ్ల సందడి నెలకొంది. కంచు పళ్లెంలో పసుపు నీళ్లు వేసి పాత్ర మధ్యలో రోకలి నిలబెట్టారు. గ్రహణ సమయంలో మాత్రమే రోకలి నిటారుగా నిలబడుతుంది అని స్థానికుల నమ్మకం. పట్టణంలోని బెలగాం జగన్నాథపురం కొత్తవలస తదితర ప్రాంతాల్లో నీ వీధుల్లో మహిళలు రోకళ్లను నిలబెట్టారు. వాటికి పసుపు తాళ్లు కట్టి పూలతో పూజించారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వంశధార నదీ తీరంలోని ఉమాకామేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్య గ్రహణం అనంతరం సంప్రోక్షణ చేసి రుద్రాభిషేకాలు చేపట్టారు. సహస్ర బిల్వార్చన పుష్పార్చన చేపట్టారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి.ఈ అద్భుతాన్ని కచ్చితంగా చూడండి..