'అసెంబ్లీకి వెళ్లని నాయకులను ఎలా గెలిపించాలి'
తిరుమలలో చెప్పులతో నడవటమేంటని జగన్‌ను పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చెప్పులతో ఆలయానికి వెళ్తే... దేవుడు క్షమించడని అన్నారు. తెదేపా నాయకులు భూబకాసురలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికలప్రచారం నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... అధికార ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై ఇన్నాళ్లు జగన్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. గత ఐదేళ్లలో ప్రజా సమస్యలపై పోరాడలేని వైకాపాకు అధికారం ఎలా ఇస్తామని నిలదీశారు. ప్రజల గడ్డం పట్టుకుంటే ఓట్లు రావని... సమస్యలు పరిష్కరిస్తేనే జనం గుర్తిస్తారని అన్నారు. తిరుమలలో చెప్పులతో నడవటమేంటని జగన్‌ను అడిగారు. చెప్పులతో ఆలయానికి వెళ్తే... దేవుడు క్షమించడని దుయ్యబట్టారు. తాను సర్వమతాలను నమ్ముతానని స్పష్టం చేశారు.
తెదేపా నాయకులు భూబకాసురలని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. నదుల్లోని మట్టి తోడుకుని తిన్నారని ఆరోపించారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో కేసీఆర్ ఐదేళ్లు ఎందుకు ఎదురుచూశారని ప్రశ్నించారు. తెలంగాణ సహకరించినా, సహకరించకున్నా పోలవరం కట్టితీరతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
జనసేన అధికారంలోకి వస్తే విద్యావిధానంలో మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తాను సామాన్యులకు మంచి భవిష్యత్తు అందించేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అండగా ఉన్నవారినే తాను నమ్మినట్టు చెప్పారు.