Janasena chief Pawan Kalyan:ప్రజలు ఎంతో కష్టపడి పన్నులు కడితే వాటిని కొందరు నేతలు దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. నేతలు అవినీతి, దోపిడీయే లక్ష్యంగా పరిపాలిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. వైసీపీ ప్రభుత్వం, సీఎం, మంత్రులపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్ కల్యాణ్.. సీఎం, మంత్రులు.. రాష్ట్రంలోని వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రోజులు మారాయన్న పవన్ .. మాటలతో మోసం చేయలేమని సీఎం జగన్ గ్రహించాలని హితబోధ చేశారు.
అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్: విద్య, వైద్యం కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని పవన్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనసేన మార్పుకోసం వచ్చిందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే పరిస్థితి లేదని పవన్ స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని పునరుద్ఘాటించారు. మార్పుకోసం వచ్చిన మనం మధ్యలో వెనకడుగు వేయకూడదని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు పవన్ వెల్లడించారు. విద్య, వైద్య వ్యవస్థలు కొంతమంది చేతుల్లో ఉంటే ఎలా? అంటూ పవన్ ప్రశ్నించారు. గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.