శనివారం సాయంత్రం అదృశ్యమై ఆదివారం మృతదేహాలగా చెరువులో తేలిన యశ్వంత్, అభిరాం కుటుంబాలకు చెందిన బంధువులు.. తమ పిల్లలను ఎవరో చంపి చెరువులో పడేశారని న్యాయం చేయాలంటూ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏలూరు - జంగారెడ్డిగూడెం రహదారిపై ఆందోళనకు దిగారు. గ్రామస్తుల రాస్తారోకోతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న దెందులూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి న్యాయం చేస్తామని నచ్చజెప్పినా వారు పట్టించుకోలేదు.
తమ పిల్లలను ఎవరో చంపేశారంటూ రాస్తారోకో.. - దెందులూరు మండలం గాలయాగూడెంలో పిల్లల అనుమానాస్పద మృతి
తమ బిడ్డలను ఎవరో చంపేశారని.. తమకు న్యాయం చేయాలంటూ దెందులూరు మండలం గాలయాగూడెంలో ఆ పిల్లల తల్లి తండ్రులు, బంధువులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు.
పోలీసు జాగిలాలను తీసుకొస్తామని.. బాలురి మృతిపై ఎటువంటి అనుమానాలున్నా తమ దృష్టికి తీసుకు వస్తే ఆ దిశగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డాగ్ స్క్వాడ్ వచ్చే వరకు ఆందోళన విరమించలేదు. జనసేన దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.