పశ్చిమగోదావరి జిల్లాలో సమృద్ధిగా గోదావరి సాగునీరు అందుబాటులో ఉంది. ఏటా రోజువారిగా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. రైతు వరి సాగుకు మాత్రం నీరు అందడం లేదు. డెల్టాలో వేల కిలోమీటర్లు విస్తరించిన సాగునీటి కాలువలు అధునీకరణకు నోచుకోకపోవడం వల్ల.. ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా నీటిని పొలానికి తీసుకెళ్లడానికి రైతులు(Paddy Former Struggle) డీజిల్ ఇంజన్లపై ఆధారపడ్డారు. గతంలో రబీ పంట సాగుకు మాత్రమే డీజిల్ ఇంజన్లు వినియోగించేవారు. ప్రస్తుతం ఖరీప్ సాగుకు సైతం ఈ ఇంజన్లు వినియోగిస్తున్నారు. డెల్టాలోని శివారు పొలాల రైతులు పరిస్థతి మరీ దారుణం.
డీజిల్ ఇంజన్లతో వరిసాగు..
పశ్చిమగోదావరి డెల్టాలో ఏలూరు, జీవీ, నరసాపురం, ఉండి, అత్తిలి కాలువలకు ప్రధాన కాలువల ద్వారా నీటి సరఫరా సాగుతోంది. అయితే రెండేళ్లుగా పూడిక తీయకపోవడంతో ఈ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. వాటిల్లో నీరు ముందుకుసాగే పరిస్థితి లేదు. దీనికితోడు నాచు, గుర్రపుడెక్కా, కలుపుమొక్కలు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. కాలువల్లో నీరు సమృద్ధిగా ఉంటేనే తూములకు నీరు అందుతుంది. కాలువలల్లో నీటి మట్టం పడిపోవడంతో తూముల ద్వారా వరి పొలాలకు నీటి సరఫరా సవ్యంగా సాగడం లేదు. దీంతో రైతులు డీజిల్ ఇంజన్లపై ఆధారపడి పంట సాగు చేస్తున్నారు. నీరు అందక పలువురి రైతుల పొలాలు ఎండిపోయాయి.
ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే కాలువలకు డీజిల్ ఇంజన్లు(diesel engines) అమర్చుకుంటున్నారు. అయితే ఈ మోటర్ల వినియోగం రైతులకు భారమైంది. పంట పెట్టుబడులకు తోడు డీజిల్ కోసం అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరా పొలం తడవడానికి రెండు నుంచి మూడు లీటర్ల డీజిల్ ఖర్చువుతోంది. ఇలా పంట కొతకొచ్చే సరికే సుమారు రూ. 4ం వేలు వరకు అదనంగా అదనపు భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కాలువ కింద గుండుగొలను నుంచి సుమారు 35వేల ఎకరాల్లో రైతులు డీజిల్ ఇంజన్లపై ఆధారపడ్డారు. అత్తిలి కాలువ కింద.. 40వేల ఎకరాల్లో.. ఉండి, ఆకివీడు కాలువ కింద సుమారు 30వేల ఎకరాల్లో ఈ ఇంజన్ల సాయంతో వరి పంటను కాపాడుకొంటున్నారు.