ప్రభుత్వ ప్రకటనతో పాఠశాలల పునఃప్రారంభం ఆగస్టు మూడో వారానికి వాయిదా పడింది. సాధారణంగా ఏడాదిలో పాఠశాల పనిదినాలు 233 ఉంటాయి. ఇప్పటికే ఈ ఏడాది 20 రోజులు కరిగిపోగా మరో 35 రోజులు బడి గంటలు వినిపించే అవకాశం లేదు. ఆగస్టు మూడో వారానికి అయినా కరోనా తగ్గుముఖం పడితే పాఠాల బోధనకు కనీసం 160- 170 రోజులు సమయం దొరికే అవకాశం ఉంది.
భావితరాల భవితవ్యమే పరమావధి
దేశంలో పరిస్థితులను అంచనా వేసిన జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం ఎనిమిది వారాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రతిపాదించింది. కేరళలో అక్కడి ప్రభుత్వం తొలి గంట (ఫస్ట్ బెల్) పేరుతో నెల రోజులుగా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పరోక్ష బోధనలో తమ విద్యార్థులను తీర్చిదిద్దడానికి వీలైన అన్ని అవకాశాలను ప్రభుత్వం సహా ప్రైవేట్ యాజమాన్యాలు అన్వేషిస్తున్నాయి. సర్కారీ బడుల విద్యార్థులకు ‘వారధి’ పేరుతో దూరదర్శన్ ప్రసారాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ తదితర ఆన్‌లైన్ పరికరాల సదుపాయం ఉన్న విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించింది. వారధి పాఠాలపై వర్క్ షీట్లను సమీక్షించి విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేయాలని చెప్పింది. పాఠశాల గ్రంథాలయాల్లోని పుస్తకాలను చిన్నారులకు ఇచ్చి సెలవుల్లో వీలైనన్ని ఎక్కువ చదివించాలని దిశానిర్దేశం చేసింది.
కార్పొరేట్ దూకుడు