పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చినవెల్లమిల్లి గ్రామానికి చెందిన ప్రేమభాయి అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టాలు ఉన్న తన భూమిలో 60వేలు పెట్టి చిన్న గుడిసెను వేసుకున్నానని.. దానిని ఇళ్ల స్థలాల పేరుతో కూల్చేశారని వృద్ధురాలు చెప్తోంది. తనకు నిలువనీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం తన స్థలంలో అధికారులు ఫొటోలు తీస్తుండగా అడ్డుపడిన వృద్ధురాలిపై వీఆర్వో ఉమామహేశ్వరరావు దుర్భాషలాడగా మనస్ధాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రేమభాయి తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.
తన గుడిసెను కూల్చారని వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం - ఉంగుటూరులో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
తన స్థలంలో కట్టుకున్న గుడిసెను ఇళ్ల స్థలాల పేరుతో కూల్చేశారని ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించింది. తనకు నిలువనీడలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు స్పందిస్తూ.. ఆ స్థలం వృద్ధురాలికి చెందినదేనని ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన వీఆర్వో ఉమామహేశ్వరరావు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణ చేసి ఆక్రమణలు తొలగిస్తున్నామని తెలిపారు. వృద్ధురాలు చెప్తున్నట్లు స్థలం తనకు చెందినదేనని ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్ కోసం ఫొటోలు తీస్తుంటే ప్రేమభాయి పురుగుల మందు డబ్బాతో అడ్డుపడిందని.. ఫొటోలు తీయెద్దని గొడవ చేసిందని తెలిపారు. వృద్ధురాలి చేతిలోని పురుగుల మందు డబ్బా లాక్కుంటే.. నోటికి రాసుకుని ఆస్పత్రికి వెళ్లిందని వీఆర్వో చెప్పారు.