RAIDS IN CINEMA THEATERS:రాష్ట్రంలోని సినిమా హాళ్లపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 సినిమా హాళ్ల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా శ్యాం సింగరాయ్ సినిమా బెనిఫిట్ షో వేసిన 5 థియేటర్లకు పది వేల చొప్పున జరిమానా విధించారు. బి ఫామ్ రెన్యువల్ చేయని 25 థియేటర్లకు జరిమానా విధించారు. బి ఫామ్ ఉన్నప్పటికీ నిబంధనలు అతిక్రమించిన 70 థియేటర్లకు నోటీసులు జారి చేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో రెవెన్యూ బృందం తనిఖీలు నిర్వహించింది.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది థియేటర్లను పరిశీలించారు. ప్రభుత్వ జీవో ప్రకారం.. సినిమా హాళ్లలో సౌకర్యాలపై యజమానులకు పలు సూచనలు చేశారు. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని 3 సినిమా హాళ్లను మూసివేశారు. తాళాలను అధికారులు స్వాధీనపరుచుకున్నారు.