పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒక్కటీ సహేతుకంగా లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం గత నెల 20న దాఖలు చేసిన అఫిడవిట్‌కు బదులుగా... రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది పేజీల కౌంటర్ దాఖలు చేసింది. 2009 మార్చి 9న జారీ చేసిన పర్యావరణ అనుమతుల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా సర్కార్ ముందుకు రాలేదని చెప్పింది. ఇప్పుడు అసంబద్ధ కోణాలు వెలికి తీస్తూ ప్రజాభిప్రాయ సేకరణ పరిధి పెంచాలని కోరుతోందని ఆక్షేపించింది. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
1980 నాటి గోదావరి జల వివాద ట్రైబ్యునల్ తీర్పుతో పాటు, నదీ పరివాహక రాష్ట్రాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే పోలవరం నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 150 అడుగుల పూర్తి స్థాయి రిజర్వాయర్ నీటి మట్టంతో నిర్మించేందుకు ఒడిశాతోపాటు అప్పటి మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం కూడా చేశాయని గుర్తు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ముంపు సమస్య తలెత్తకుండా రక్షణ గోడ నిర్మించేందుకు అంగీకారం ఆ ఒప్పందంలోనే కుదిరిందని తెలిపింది.