Bhadradri Kothagudem District Forest Officers: అటవీ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న గొత్తికోయలు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ అటవీ శాఖాధికారులు ఆదివారం నోటీసులు అందించారు. ఈ నెల 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్యకు గురైన నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎఫ్‌డీవో అప్పయ్య, చంద్రుగొండ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ సిబ్బంది బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించారు. 2016 తర్వాత గొత్తికోయలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి ఈ ప్రాంతంలో నివసించే హక్కు లేదని ఎఫ్‌డీవో పేర్కొన్నారు. అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎక్కడి నుంచి వచ్చారో అదే ప్రాంతానికి వెళ్లిపోవాలని కోరారు. అటవీశాఖ సిబ్బంది వెంట ప్రత్యేక పోలీసు బలగాలు ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..:చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు 22వ తేదీ ఉదయం పోడుభూముల సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై మూకుమ్మడిగా దాడికి యత్నించడంతో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకున్నారు.