ఎన్నో కష్టనష్టాల కోర్చి పంట పండిస్తున్నారు... ప్రభుత్వాలు, బ్యాంకులు పట్టించుకోకున్నా కాడి పడేయకుండా స్వయంకృషినే నమ్ముకున్నారు. కల్తీ విత్తనాలు, పెరిగిన ఎరువుల ధరలు, కల్తీ పురుగు మందుల దాడులు తట్టుకొని నిలబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ధీమా ఇస్తుందనుకున్న రైతుభరోసా నీరాశే మిగులుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు మూడున్నర లక్షల కౌలు రైతులున్నారు. ఇందులో 22 వేల మందికే కౌలు పత్రాలున్నాయి. వీరిలో 4 వేల మందికే రైతు భరోసా దక్కింది. క్షేత్రస్థాయిలో పంటలు సాగుచేస్తున్న కౌలు రైతులను గుర్తించి సహాయం చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అమలు కావడం లేదు. సర్కారు నిబంధనలకు క్షేత్రస్థాయి సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. పొలం కౌలుకు చేస్తున్నట్లు నమోదు కావడం లేదు. ఈ-పంట నమోదులో భూయజమాని పేరు ఉంటుంది. ఈ కారణంగా కౌలురైతుకు రైతు భరోసా దక్కడంలేదు. క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించి కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేయాలని వారు కోరుతున్నారు.