సాధారణంగా ఎకరం చేపల చెరువులో రెండున్నర వేల చేప పిల్లల పెంపకం చేపడతారు. కానీ.. చిన్న ట్యాంకులో ఎనిమిదన్నర వేల చేప పిల్లల పెంపకాన్ని చేపడుతున్నారు ఇంజినీరింగ్ విద్యార్థులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానంతో కాలుష్యంలేని చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఆప్టిమల్ రీ సర్క్యులర్ సిస్టం (ఓఆర్ఎస్) గా పిలిచే ఈ విధానాన్ని కళాశాల ఆవరణంలోనే ఏర్పాటు చేసి.. పరిశోధనలు సాగిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం వట్లూరు రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు చేపల పెంపకంలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఓఆర్ఎస్గా ఈ విధానానికి నామకరణం చేశారు. తక్కువ విస్తీర్ణం, నీటితో చేపల పెంపకానికి శ్రీకారం చుట్టారు. కళాశాలకు చెందిన సుధీర్, కళ్యాణ్, కాళేష్, వెంకటేష్, యశ్వంత్ సాయి అనే విద్యార్థులు కలసి ఈ విధానం అమలు చేస్తున్నారు. కళాశాల ఆవరణలోనే ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నాలుగు సెంట్ల స్థలంలో 13 అడుగుల గోతి తవ్వారు. నీరు ఇంకిపోకుండా.. పాలిథిన్ కవర్ అమర్చారు. నాలుగు లక్షల లీటర్ల నీటిని ఇందులో నింపారు. నీటిని ఫిల్టర్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గాలిని పంపింగ్ చేసే.. బ్లోయర్ యంత్రాన్ని అమర్చారు. ఇందులో ఎనిమిదన్నర వేల చేపలను మూడునెలల కిందట వదిలారు. చేపలకు ఫ్లోటింగ్ ఫీడ్ అందిస్తున్నారు. నీటిని శుద్ధిచేసేందుకు ఫిల్టర్ 24గంటలు పనిచేస్తుంటుంది.