ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నూతన విధానం ప్రారంభించనుంది. ఇందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచడంతో పాటు నూతన విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు.. రైతు భరోసా కేంద్రాలకు.. అనుసంధానంగా పని చేయనున్నాయి. ధాన్యం దిగుబడి ఆధారంగా ప్రతి రైతుభరోసా కేంద్రానికి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉన్న చోట్ల రెండు, మూడు రైతు భరోసా కేంద్రాలకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అదనంగా 293 కేంద్రాలను పెంచారు. గత ఏడాది సీజన్లో 340 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ సీజన్లో అదనపు కేంద్రాలతో కలిపి 633 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నవంబర్ మొదటి వారంలో ఈ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
పంటను అమ్మే రైతులు సాగు విస్తీర్ణం, దిగుబడి పంట చేతికొచ్చే తేదీ, తదితర వివరాలను రైతు భరోసా కేంద్రాలు వద్ద నమోదు చేసుకోవాలి. నమోదుకు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతా నెంబరు, రైతు చరవాణి నెంబరు ఇవ్వాలి. రైతు భరోసాలో నమోదు కావాలంటే ఈ క్రాఫ్ లో రైతు నమోదు అయి ఉండాలి. రైతు నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వారం రోజుల పాటు కొనసాగుతుంది.