ఏపీ, ఒడిశాలోని పోలవరం నిర్వాసిత గ్రామాలు, కొత్తగా నిర్మించిన పునరావాస కాలనీలను ఇటీవల సందర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్... పలు లోపాలను ఎత్తిచూపింది. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ.. నిర్వాసితులకు పునరావాసంపై చూపడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంతనాయక్‌తో కూడిన బృందం ఆగస్టు 24 నుంచి 4 రోజులపాటు పర్యటించింది. ఈమేరకు ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌తోపాటు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. దీనిపై 4వారాల్లోగా నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.
పునరావాస గ్రామాల్లో ఉల్లంఘనలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు జాతీయ ఎస్టీ కమిషన్ తెలిపింది. 2013 పునరావాస చట్టం 30 ప్రకారం నిర్వాసితులకు వసతుల విషయంలో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పనులు చేపట్టడం లేదని వివరించింది. భూమికి బదులుగా ఇచ్చిన భూమి.. కొన్నిచోట్ల వ్యవసాయయోగ్యం కాదని తెలిపింది. అటవీ, కమ్యూనిటీ చట్టాలను వర్తింపజేయడం లేదని గిరిజనులు వాపోతున్నారని తెలిపింది. దీనిపై అధికారుల నుంచి సమాధానమూ లేదని వెల్లడించింది. పునరావాస కల్పనకు ముందే అటవీ హక్కుల చట్టం కింద వారికేమేమి లభిస్తాయో అందించే వరకూ గిరిజనులను తరలించడానికి వీల్లేదంది. వ్యవసాయం కోసం కమ్యూనిటీ అంతటికీ కలిపి ఏపీ ప్రభుత్వం భూమినిస్తోందని.. వ్యక్తిగతంగా పట్టాలివ్వాలని గిరిజనులు కోరుతున్నారని స్పష్టంచేసింది.
పోలవరం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు సరిగా లేవని.. శ్లాబుల్లోంచి నీరు లీకవుతోందని ఎస్టీ కమిషన్ పేర్కొంది. అలాగే గోడలు బీటలు వారాయని, ఏ ఇతర వసతులూ కల్పించలేదని గుర్తించినట్లు తెలిపింది. సరైన మంచినీటి వసతి, రోడ్లు, డ్రైనేజీ లేవని.. ఇళ్లకు కిటికీలు, విద్యుత్ సదుపాయం, మరుగుదొడ్లు సరిగా నిర్మించలేదని గుర్తుచేసింది. నిర్వాసితుల సమస్యలను పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తంచేసింది. నిర్వాసితుల ఫిర్యాదుల స్వీకరణ- పరిష్కార వ్యవస్థ కనిపించలేదని తెలిపింది.