Janasena councilor suspend from municipal council meeting: మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభం కాగానే మాటల యుద్దం మొదలైంది. ఈ క్రమంలో ఓ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్‌తో దురుసుగా ప్రవర్తించారు. ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ కౌన్సిలర్ రెండు నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
ఈరోజు నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంనిర్వహించారు. ఈ సమావేశానికి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు హాజరయ్యారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు సమావేశాన్ని ప్రారంభించే క్రమంలో జనసేనకు చెందిన 22వ వార్డు కౌన్సిలర్ భారతీ సురేష్.. మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు వేలు చూపిస్తూ.. 'వార్డు సమస్యలు వివరించడానికి నేను ఫోన్ చేస్తే.. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ఆయనను హెచ్చరించారు.
రెండు నెలల పాటు సస్పెండ్: కమిషనర్‌కు వేలు పెట్టి చూపిస్తూ సభ్యులు ఏక వచనంతో మాట్లాడటం సరైన పద్ధతి కాదని చెప్పారు. దీంతో కమిషనర్‌కు సపోర్టుగా అధికార వైసీపీ కౌన్సిలర్లు నిలబడ్డారు. పదేపదే అధికారులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న 22వ వార్డు కౌన్సిలర్ భారతి సురేష్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఛైర్ పర్సన్ ఛాంబర్ వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించారు. భారతి సురేష్‌ను సస్పెండ్ చేయకపోతే ఊరుకునేది లేదంటూ కౌన్సిలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.