జంగారెడ్డిగూడెంలో మరణాలపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. కమిటీ సభ్యుడు నాగబాబుతో కలిసి మంగళవారం ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించి, సారా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. పట్టణంలోని గాంధీ బొమ్మ కూడలిలో ఉన్న నాలుగు కుటుంబాలను ఓదార్చి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మనోహర్ మాట్లాడారు. ‘18 మంది కాదు.. ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ అంశాన్ని శాసనసభలో పక్కదోవ పట్టిస్తున్నారు. ఇది ఎన్నికల సమయం కాదు. రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. ‘పోస్టుమార్టం నివేదిక ఇంకా ఎందుకు రాలేదు. కలెక్టర్ వచ్చి పరామర్శించలేదు. బాధితుల తరఫున పోరాటం చేస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘విశాఖలో విషవాయువుల ప్రభావంతో చనిపోతే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా?’ అని ప్రశ్నించారు. నాగబాబు మాట్లాడుతూ.. ‘ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. సహజ మరణాలని శాసనసభలో ప్రకటించడం దారుణం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నాటుసారా మరణాలపై స్పందించిన ప్రభుత్వం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై... ప్రభుత్వం స్పందించింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. నాటుసారా.. అక్రమ నిల్వదారులపై పలు సెక్షన్ల కింద 10 కేసులు నమోదు చేసింది. నాటుసారా మరణాలను 'ఈటీవీ ఆంధ్రప్రదేశ్', 'ఈనాడు', 'ఈటీవీ భారత్' సంయుక‌్తంగా వెలుగులోకి తెచ్చాయి. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగడంతో.. అధికారులు కేసులు నమోదు చేశారు.