ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇప్పటికీ తెలియని కారణం.. వింతవ్యాధితో ఆందోళనలో జనం - mysterious disease at komarepalli news

పశ్చిమగోదావరి జిల్లా కొమరేపల్లిలో వింతవ్యాధి కలవరం సృష్టిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఇలాంటి సంఘటనలు జరగటం ఆందోళన కలిగిస్తుంది. కారణాలు తెలుసుకునేందుకు బాధిత ప్రాంతాల్లో వైద్య బృందం పర్యటిస్తూ.. నమూనాలు సేకరిస్తోంది.

వింతవ్యాధి కలవరం
వింతవ్యాధి కలవరం

By

Published : Jan 24, 2021, 10:21 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో వింతవ్యాధి కలకలం

వింతవ్యాధి కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు వరుసగా అస్వస్థతకు గురవుతుండటం కలకలం రేపుతోంది. గతంలో ఏలూరు, పూళ్ల, ఇప్పుడు కొమరేపల్లిలో వరుస ఘటనలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఏలూరు కాలువ పరీవాహక గ్రామాల్లోనే వింతవ్యాధి ప్రబలుతుండటంపై అధికారులు దృష్టి సారించారు.

జిల్లాలో మరోసారి బయటపడ్డ వింతవ్యాధి... ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. దెందులూరు మండలం కొమరేపల్లిలో నిన్న ఉదయం నుంచి 25మంది వింతవ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి, గుండగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారికి చికిత్స అందించారు. కొమరేపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. పది మంది వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు సంయుక్తంగా ఈ పరిస్థితికి గల కారణాలను గుర్తించడంలో నిమగ్నమయ్యాయి. గ్రామంలో తాగునీరు, ఆహారం, కూరగాయలు, స్థానికుల రక్త నమూనాలు సేకరించారు.

"ఏలూరు కాలువ పరీవాహక ప్రాంతంలోనే వరుసగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మూర్ఛ, సొమ్మసిల్లి పడిపోవడం, నోట్లో నురగలు, కాళ్లూచేతులు పనిచేయకపోవడం లాంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు" -మోహన్, జిల్లా వైద్యాధికారి

ఈ ఘటనకు ముందు.... వారం రోజులుగా భీమడోలు మండలం పూళ్లలో 36 వింతవ్యాధి కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు.. ఏలూరులో 600 మందికి పైగా ఆస్పత్రుల పాలైన ఘటన.. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఏలూరులో రోజూ నీటి నమూనాలు తీసి పరీక్షించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులను ఆదేశించారు. అయితే.. ఘటన సమయంలో చర్యలు చేపట్టి, తర్వాత పక్కన పెట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.

ఇదీ చదవండి:

కొమరేపల్లిలో 31కి చేరిన వింత వ్యాధి బాధితులు

ABOUT THE AUTHOR

...view details