మూర్తిరాజు పూర్తిపేరు చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు. 1919 డిసెంబరు 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో జన్మించారు. చిన్ననాటి నుంచే సామాజిక స్పృహ ఎక్కువ. విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. కళలంటే ప్రాణం. మద్యపాన మహమ్మారిపై పోరాడారు. మెరుగైన రాజకీయాల కోసం ఆరాటపడ్డారు. ఆంధ్రాగాంధీగా సామాజిక, రాజకీయ, సేవారంగాల్లో నేటి తరానికి అనుసరణీయుడయ్యారు... భావితరాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు.
మహాత్ముని ముద్ర
మూర్తిరాజు తన చిన్నతనంలో చేబ్రోలు రైల్వేస్టేషన్‌లో మహాత్మాగాంధీని చూశారు. ఆయనంటే ఎనలేని అభిమానం ఏర్పడింది. నాటి నుంచి మూర్తిరాజు శాకాహారమే తీసుకునేవారు. ఖద్దరు దుస్తుల్నే ధరించేవారు. గాంధీతత్వాన్ని అందరికీ అందించాలని భావించారు. మహాత్ముని సిద్ధాంతాలపై అధ్యయనం చేసేవారికి అన్నిసౌకర్యాలూ ఉండేలా పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనాన్ని నిర్మించారు. 1969లో అప్పటి ఉపప్రధాని మొరార్జీ దేశాయ్ దీనికి శంకుస్థాపన చేశారు. ఇలాంటి భవనం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు.
పెదనిండ్రకొలనులో గాంధీ భవనం(పార్లమెంటు నమూనాలో) విద్యాదాత.. సేవాప్రదాత
మహిళ చదువుకుంటే ఇంటిల్లిపాదికీ జ్ఞానం కలుగుతుందని మూర్తిరాజు బలంగా నమ్మారు. తన తండ్రి బాపిరాజు పేరుతో ‘బాపిరాజు ధర్మసంస్థ’ను స్థాపించారు. రాష్ట్రంలో మొత్తం 68 విద్యాసంస్థలను నెలకొల్పారు. కాలక్రమంలో వాటన్నింటినీ ప్రభుత్వానికి దఖలు పరిచారు. ఇప్పటికీ ఆయా విద్యాలయాల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. తండ్రి నుంచి తనకు సంక్రమించిన 1,800 ఎకరాల భూమిని సేవా కార్యక్రమాలకే వినియోగించారు. ఏలూరులో సెయింట్ థెరిసా విద్యాసంస్థలకు వంద ఎకరాలు దానమిచ్చారు. భూదాన ఉద్యమంలో వినోబాభావేకు దాదాపు వంద ఎకరాలు అందించారు. తన స్వగ్రామంలో ప్రతి నెలా నాటక ప్రదర్శనలు నిర్వహించి పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకునేవారు. గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. మరణించే నాటికి ఆయనకు ఎలాంటి ఆస్తులూ లేకపోవడం గమనార్హం.
గణపవరంలో మూర్తి రాజు విద్యాలయం
స్వచ్ఛ నాయకుడు
మెరుగైన సమాజ స్థాపనకు మూర్తిరాజు రాజకీయాల్లో ప్రవేశించారు. గ్రామస్వరాజ్య సాధనే లక్ష్యంగా కృషి చేశారు. 1952-1982 మధ్యకాలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఓ పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికకావడం విశేషం. గిడ్డంగులు, దేవాదాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ముక్కుసూటిగా వ్యవహరించారు. నీతి నిజాయతీలకు మారుపేరు అనిపించుకున్నారు. మద్య నిషేధం కోసం అనేకసార్లు ఉద్యమించారు. మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలిపేందుకు 965 కి.మీ.పైగా పాదయాత్ర చేశారు. 2012 నవంబరు 12న తన 93వ ఏట ఆయన కన్నుమూశారు.
ఇదీ చదవండి :
వైకాపా ఎంపీని పలకరించిన ప్రధాని మోదీ