ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Torture: చిన్నారిపై పెంపుడు తల్లి కర్కశత్వం.. ఒళ్లంతా వాతలు పెట్టి చిత్ర హింసలు ! - చిన్నారిపై పెంపుడు తల్లి కర్కషత్వం

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చిన్నారిపై పెంపుడు తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. ఇంట్లో పనులు చేయటం లేదంటూ ఒళ్లంతా వాతలు తేలేలా కొట్టి హింసించింది. ఈ దారుణ ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంది.

చిన్నారిపై పెంపుడు తల్లి కర్కషత్వం
చిన్నారిపై పెంపుడు తల్లి కర్కషత్వం

By

Published : Feb 5, 2022, 8:42 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్​లో దారుణ ఘటన వెలుగు చూసింది. 9 ఏళ్ల బాలికను పెంపుడు తల్లి చిత్ర హింసలకు గురి చేసింది. పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్థానిక ఎస్సై సాగర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ నగర్​కు చెందిన యనమదల ధర్మరాజు, లక్ష్మీ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో తాడేపల్లి గూడెంకు చెందిన చిన్నారిని రెండేళ్ల వయస్సున్నప్పుడు దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నేళ్ల పాటు చిన్నారిని బాగానే చూసుకున్నారు. ఈ మధ్య కాలంలో లక్ష్మీ కువైట్ వెళ్లటంతో చిన్నారి ఆలనాపాలనా ధర్మరాజు చూసేకునేవాడు. లక్ష్మీ గతేడాది డిసెంబర్​లో కువైట్ నుంచి తిరిగి స్వగ్రామానికి చేరుకోగా..ఆమె భర్త ధర్మరాజు కువైట్ వెళ్లాడు.

అప్పటి నుంచి చెప్పిన మాట వినటం లేదని., ఇంట్లో పనులు చేయటం లేదని బాలికను లక్ష్మీ చిత్ర హింసలకు గురి చేస్తోంది. ఒంటిపై వేడినీళ్లు పోయటంతో పాటు వాతలు తేలేలా కొట్టి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. లక్ష్మీ ఎన్ని చిత్రహింసలకు గురిచేసినా.. ఎవ్వరికి చెప్పకుండా బాలిక భరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ పాఠశాలకు వచ్చిన బాలిక ఒంటిపై మరో విద్యార్థిని సరదాగా చేయి వేయటంతో భోరున విలపించింది. దీన్ని గమనించి ఉపాధ్యాయురాలు బాలికను పరిశీలించగా ఒంటి నిండా కాలిన గాయాలు, వాతలు కంటపడ్డాయి. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాలికను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంపుడు తల్లి లక్ష్మీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధిత బాలికను జిల్లా ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details