కరోనా రెండోదశ నియంత్రణ చర్యల్లో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరును శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యవేక్షించారు. పోలీస్ అధికారులు వెంటరాగా...ఎమ్మెల్యే కారుమూరి ద్విచక్రవాహనంపై పట్టణమంతా సుడిగాలి పర్యటన చేశారు. పలుచోట్ల రోడ్లపై సంచరిస్తున్న వారికి ఇంట్లో ఉండి కరోనా నివారణకు సహకరించాలని సూచించారు. పలు చోట్ల కర్ఫ్యూ తీరును పరిశీలించిన ఆయన.. నిబంధనలు ఉల్లంఘించే వారిని ఉపేక్షించ వద్దని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కరోనా రెండో దశ చాలా వేగంగా విస్తరిస్తున్నందున... ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో ఉండి లాక్ డౌన్ అమలుకు సహకరించాలని కోరారు. వారానికి ఒకరోజు సరకులు కొనుగోలు చేయాలని సూచించారు . దుకాణాల వద్ద మూకుమ్మడిగా కొనుగోలు చేయడం వల్లే కరోనా ఎక్కువగా విస్తరిస్తోంది అని చెప్పారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు.