పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పర్యటించారు. అధికారులు, స్థానిక నాయకులతో ఇళ్ల పట్టాల పంపిణీకి చేపడుతున్న పనులపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. జులై 8 నాటికి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, భూసేకరణ పూర్తి చేశామన్నారు అధికారులు. అర్హత ఉన్నవారిని పరిగణలోనికి తీసుకోవాలని మంత్రి వారికి చెప్పారు. ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలన్నారు. ఎక్కడికక్కడ ఖిలపక్షం ఏర్పాటు చేసి లబ్ది దారుల జాబితాను చర్చించి అర్హులను గుర్తించాలని దిశానిర్దేశం చేశారు.