పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట రామన్న గూడెంలోని వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో.. వివిధ పనులకు మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయంలోని ఉద్యాన నైపుణ్య కేంద్రం వద్ద .. ఎండిన పూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఉద్యాన పంటల నర్సరీ యాజమాన్యం, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, జీవ నియంత్రణ ఉత్పత్తి వంటి పలు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు.
విశ్వవిద్యాలయంలోని పలు శాఖలను సందర్శించి.. ఇక్కడ ఉత్పత్తి చేసే వివిధ రకాల న్యూట్రీ బిస్కెట్లు, తేనె, పుట్టగొడుగుల గురించి ప్రధాన శాస్త్రవేత్త కరుణశ్రీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, అబ్బాయి రాజుతో పాటు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.