Minister Karumuri Presmeet on farmers: అకాల వర్షాలు వల్ల నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు నిరంతరం కొనసాగుతుందని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత వేగవంతం చేశామని మంత్రి వివరించారు. అమరావతి అవినీతిపై హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టు కొట్టేసిందని.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 370 కోట్లు కేబుల్స్ స్కాంలో 275 కోట్లు అవినీతి విషయంలో అరెస్టు చేస్తారనే భయంతో చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నారని చెప్పారు. రైతులు రాకపోయినా కార్యకర్తలను రాకపోయినా ప్రజల మధ్య ఉంటే అరెస్టు చేయరనే భావనతో తిరుగుతున్నారని చెప్పారు. రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి అమలు చేస్తుందని మంత్రి కారుమూరి వివరించారు.
రైతులకు భారీగా నష్టం..అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలకూ భారీగా నష్టం వాటిల్లింది. వర్షాల ధాటికి పంటలు, ధాన్యం రాశుల్ని ఆరబెట్టుకోవడం రైతులకు కష్టసాధ్యంగా మారింది. కాస్త తెరిపి వచ్చిందని ఎండబెట్టుకునేలోగా మళ్లీ కురుస్తున్న వర్షాలతో.. ధాన్యాన్ని తడి వీడటం లేదు. రాశుల్లోనే ధాన్యం మొలకలొచ్చి.. పనికిరాకుండా పోతోంది. పసుపు, మొక్కజొన్న, మిరప పంటలూ.. రైతుకు కన్నీళ్లే మిగులుస్తున్నాయి. ఉద్యాన పంటలైన మామిడి, అరటి పంటలూ భారీగా దెబ్బతిన్నాయి. మొత్తం18 జిల్లాల్లో భారీ వర్షాలకు అధిక నష్టం జరిగింది. సుమారు 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఉంటాయని ప్రాథమికంగా అంచనా కట్టారు.