పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దానిపై ప్రతి రూపాయి ఖర్చు బాధ్యత కేంద్రానిదే అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఆయన పర్యటించారు. 2014 భూసేకరణ చట్టప్రకారం కేంద్రమే నిధులివ్వాలని, ఇస్తుందని సైతం చెప్పారు.
పోలవరానికి ప్రధాని మోదీ అన్ని రకాలుగా సహకరిస్తున్నారన్నారు. జలాశయ ఎత్తు తగ్గిస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్పందించారు. అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి విశాఖకు నీళ్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఎత్తు తగ్గిస్తున్నామని, గుత్తేదారులతో లాలూచీ పడ్డామని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారని అనిల్ కుమార్ అన్నారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.17 వేల కోట్లు ఏవిధంగా 70 శాతం అవుతుందని మంత్రి ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లిస్తామన్నారు.