పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమల్లి వద్ద ఉన్న రాష్ట్ర సరిహద్దుకు... తెలంగాణ నుంచి 160 మంది వలస కూలీలు చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకపోవటంతో రాష్ట్రంలోకి అనుమతించలేదు. ఆదివారం తెల్లవారుజామున ఇక్కడికి చేరుకున్న వీరంతా అనుమతి కోసం రోజంతా రోడ్డుపై నిరీక్షించారు. అయినప్పటికీ పోలీసులు రాత్రి వెనక్కి పంపించారు.
దీనివల్ల చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజంతా రహదారిపై ఉంచి చివరికి తిప్పి పంపించడం బాధాకరమని కూలీలు వాపోయారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తమను వెనక్కి పంపిస్తే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలవరం సీఐ నరసింహ మూర్తి స్పష్టం చేశారు.