స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీలు, కార్మికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద పని చేస్తున్న వలస కూలీలు స్వరాష్ట్రాలకు వెళ్తామంటూ మండుటెండలో రోడ్డుపై బైఠాయించారు. శనివారం ఉదయం లేబర్ క్యాంపుల నుంచి కాలినడకన కూలీలు బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. స్వరాష్ట్రాలకు వెళ్తాం తప్ప.. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని కడెమ్మ వంతెన వద్ద బైఠాయించారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ప్రాజెక్టు వాహనాలను రప్పించి తిరిగి లేబర్ క్యాంపులకు కూలీలను పంపించేందుకు ఎక్కించారు. కూలీలు మాత్రం ప్రాజెక్టులోకి వెళ్లబోమంటూ వాహనాల్లోంచి దిగిపోయారు. బిహార్ కూలీలు వెళ్లడానికి అనుమతి వచ్చిందని, ప్రత్యేక రైలు రావాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. అదే విషయం కూలీలకు చెప్పినా వినకపోవడంతో అదనంగా పోలీసులను రప్పించామన్నారు. రైలు వచ్చేవరకు ఇక్కడే ఉంటామని సుమారు 600 మంది చెప్పడంతో మేఘా కంపెనీ వారు భోజన సదుపాయం కల్పించారు.