లాక్ డౌన్ ప్రారంభమైన నెలన్నర రోజుల అనంతరం వలస కూలీల ప్రయత్నాలు ఫలించాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. జిల్లా అధికారులు కూలీలను వారి వారి రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సమారు 12 వందల మంది కార్మికులను ప్రత్యేక బస్సుల్లో నిడదవోలు తరలించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, నిడదవోలు శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు వలస కార్మికులకు ఆహార పొట్లాలు అందించారు. నిడదవోలు నుంచి ప్రత్యేక రైలులో వీరిని స్వరాష్ట్రాలకు పంపించారు. ఒక్కొక్క బోగీలో 54 మంది ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ రమణారెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి వలస కార్మికుల తరలింపును పర్యవేక్షించారు. వలస కార్మికుల తరలింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి వనిత పేర్కొన్నారు. మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు నాలుగు వేల మందికి పైగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకు పోతే ప్రభుత్వ ఖర్చులతో తీసుకువచ్చారని చెప్పారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 2 వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారన్నారు.