పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో అనేక అక్రమాలు చోటుచేసుకొంటున్నాయి. సిఫార్సులు, పైరవీలు, మామూళ్లతో అనర్హులకు సైతం ఇంటి స్థలాలు అందిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న పేదలకు మాత్రం పట్టాలు అందడం లేదు.
ఈమె పేరు వరలక్ష్మీ.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన మహిళ. భర్త చనిపోవటంతో తన ఇద్దరు చిన్నపిల్లల్ని తన రెక్కల కష్టంతో పోషించుకొంటోంది. ఇల్లులేని వరలక్ష్మీ... ప్రభుత్వం అందించే ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంటి స్థలం కావాలంటే 60వేల రూపాయలు మామూళ్లు ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. రెండు రూపాయల వడ్డీకి అప్పుచేసి.. 60వేల రూపాయలు చెల్లించింది. తీరా స్థలాలు చేతికి వస్తాయన్న సమయంలో జాబితాలో ఆమె పేరు లేదు. చెల్లించిన డబ్బు ఇచ్చేది లేదని.. దిక్కున్న చోట చెప్పుకోమని స్థానిక నాయకులు బెదిరింపులకు దిగారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఎంతోమంది..
వరలక్ష్మీలా మోసపోయిన వారు జిల్లాలో అనేక మంది ఉన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇంటి పట్టాల జాబితాలో చోటుండటం లేదు. నిరుపేదలైన అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని ప్రభుత్వం అంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో స్థానిక నాయకులు చెప్పినవారే జాబితాలో ఉంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. పలు గ్రామాల నుంచి బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులు చేస్తుండటం ఇందుకు ఉదాహరణ.