గోదావరి, కృష్ణా నదుల ముఖద్వారాల వద్ద మడఅడవులు విస్తరించాయి. తీరప్రాంతంలో జీవవైవిధ్యాన్ని కాపాడడానికి సహజసిద్ధంగా తయారయ్యాయి ఈ మడఅడవులు. తీరప్రాంతానికి రక్షణతోపాటు.. పక్షులు, సముద్ర జీవులకు సురక్షిత ప్రాంతాలుగా మారాయి. భారీ వృక్ష సంపదతో ఉండే ఈ అభయారణ్యం అనేక తుపాన్ల నుంచి తీరప్రాంతాన్ని కాపాడింది. కాకినాడ తీరంపై పెథాయ్ తుపాను విరుచుకుపడిన సమయంలో గాలి వేగాన్ని తగ్గించి.. ఎక్కువ నష్టం జరగకుండా మడఅడవులు నియంత్రించాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో రుజువైంది.
కవచకుండలాలు
కాకినాడ సమీపంలోని కోరంగి అభయారణ్యం మడఅడవులకు పెట్టింది పేరు. వందల చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అడవులు మిగతా వృక్షాల కంటే భిన్నమైనవి. తీరాన్ని రక్షించే కవచ కుండలాలుగా ఇవి పనిచేస్తాయి. నిరంతరం సముద్రంపై నిఘావేసి విరుచుకుపడే అలలను కాచుకుంటాయి. వందల సంఖ్యలో మొలస్కా, చేపలు, రొయ్యలు, తాబేళ్ల సంతానోత్పత్తికి తోడ్పాటునందిస్తాయి. వీటి వేర్లు బలంగా మట్టిలో పాతుకుపోవడం వల్ల.. తీరం కోతకు గురికాకుండా ఉంటుంది.
మానవ తప్పిదాలే కారణం
గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో అధికంగా మడ అడవులు విస్తరించి ఉన్నాయి. కాలక్రమంలో వీటి విస్తీర్ణం తగ్గుతోంది. తీరంలో ఆక్వా విప్లవం తర్వాత ఇది మరింత పెరిగింది. గతంలో వంటచెరకు, నివాస ప్రాంతాలు, నాటుసారా కాల్చడం కోసం మడ అడవులను నరికేవారు. ప్రస్తుతం వీటిని నరికేసి రొయ్యలు, చేపల చెరువులుగా మారుస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతమే ఇందుకు ఉదాహరణ. జిల్లాలోని నరసాపురం ప్రాంతంలో ఒకప్పుడు దట్టంగా ఉన్న మడ అభయారణ్యం.. ఇప్పుడు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అసలు వీటి జాడే కనిపించడంలేదు.
ఉపాధికి గండి