ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Manavatha Organization: 108 మందితో ప్రారంభమై..40 వేల సభ్యులకు చేరి

సమాజానికి ఎంతో కొంత తన వంతుగా సేవ చేయాలని భావించాడా ప్రధానోపాధ్యాయుడు. విద్యార్థులను తీర్చిదిద్దినట్లే సేవా సంస్థను ముందుకు నడుపుతున్నాడు. క్షతగాత్రుల సాయం కోసం ఏర్పడిన ఆ సేవా సంస్థ నేడు అనేక రకాల సేవలను అందిస్తోంది. అదే "మానవత" కు మారుపేరుగా నిలిచిన 'మానవత' స్వచ్ఛంద సంస్థ. మానవత అందించే సేవలపై వివరాలు...

By

Published : Sep 11, 2021, 4:06 PM IST

Manavatha Organization
'మానవత' స్వచ్ఛంద సంస్థ

పరిమళించిన మానవత్వం

అదో సేవా సంస్థ..! గాయపడిన వారికి సాయం చేయడం కోసం 2004లో ఏర్పడింది..! కానీ ఇప్పుడు అన్ని రకాల సేవలూ అందిస్తోంది..! 108 మందితో ప్రారంభమైన ఆ సంస్థ ఇప్పుడు 40 వేల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు చేస్తోంది. దాదాపు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో విస్తరించింది. అదే ప్రజలపై మానవత్వం చూపుతున్న 'మానవత' స్వచ్ఛంద సేవా సంస్థ.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి కళాశాల ప్రధానోపాధ్యాయుడు. సమాజానికి కొంతైనా తన వంతు సాయం అందించాలనుకున్నారు. ఆయన ఆలోచనల నుంచి పుట్టిందే మానవత స్వచ్ఛందసేవా సంస్థ. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్లను తక్షణమే ఆసుపత్రికి తరలించి కాపాడాలనే ఉద్దేశంతో జంగారెడ్డిగూడెంలో ప్రారంభించారు. 2004 లో 108 మంది విద్యార్థులతో ఆయన సేవా సంస్థను ప్రారంభించారు. అలా చిన్న గ్రామంలో మొదలైన మానవత సంస్థలో ప్రస్తుతం 10 జిల్లాల్లో విస్తరించింది. 40 వేల మంది వరకూ ఈ సంస్థలో సభ్యులున్నారు. సంస్థ ఏర్పడిన తొలినాళ్లలో క్షతగాత్రులకు సేవలందించింది. క్రమేణా సేవలతో పాటు సంస్థ కూడా విస్తరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సంస్థ జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. సేవల విస్తరణలో భాగంగా ప్రమాదాల్లో గాయపడిన వారి కోసమే కాకుండా మరణించిన వారి అంతిమయాత్రల కోసం శాంతిరథాలు, ఫ్రీజర్‌ బాక్సులు సమకూర్చుతున్నారు. రక్త దానం, వస్త్రదానం, విద్యా దానం, నేత్ర దానం, అన్న దానం వంటి పలు సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా ఉచిత వైద్య శిబిరాలను సైతం నిర్వహిస్తున్నారు.

ఈ సంస్థ పలు సేవలనందిస్తోంది. మానవతలో సభ్యులైన ప్రతిఒక్కరూ నేత్రదానం చేస్తున్నారు. కొందరు సభ్యులైతే తమ పుట్టినరోజు వేడుకల్ని.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేసి జరుపుకుంటారు. కేవలం పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ మానవత పరిమళించింది. ఈ సంస్థలో వివిధ రంగాల వారు సభ్యులుగా ఉన్నారు. వీరిలో విశాంత్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఉన్నారు. మానవత సంస్థలో సభ్యునిగా చేరాలంటే 600 రూపాయల సభ్యత్వ రుసుం చెల్లించాలి. ఈ సేవలను ఇక్కడికే పరిమితం చేయకుండా..రాష్ట్రవ్యాప్తంగా మానవత సేవలు మరింత విస్తరిస్తామని సంస్థ సభ్యులు చెబుతున్నారు.

"ఎవరైనా మానవతలో సభ్యులుగా చేరగలగాలనే అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రవేశ రుసుం రూ.600 గా నిర్ణయించాం. సంస్థ ద్వారా పలు సేవలను అందిస్తున్నాం" -శేషగిరిరావు, మానవత సంస్థ అధ్యక్షుడు, ప.గో.జిల్లా

" అంతిమ యాత్రల కోసం శాంతి రథాలు, ఫ్రీజర్ బాక్సులను ఏ సమయంలోనైనా మా సంస్థ సమకూర్చుతుంది" - రత్నాకర్‌, మానవత సంస్థ కార్యదర్శి, ప.గో.జిల్లా

"రోడ్డుప్రమాద బాధితులకు సహాయం చేయడం కోసం ఎవరూ తొందరగా ముందుకు రారు. అటువంటి వారిని ఆదుకోవాలని రామచంద్రారెడ్డి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు గురైన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చుతాము" - కృష్ణారావు, మానవత సంస్థ సభ్యుడు

" పలు జిల్లాల్లో సంస్థ సేవలను విస్తరించాం. ఆడంబరాలకు పోకుండా అవసరమైన వారికి సేవ చేయడమే మా ధ్యేయం. సంస్థను మరింత విస్తరిస్తాం" - సత్యనారాయణ, మానవత సంస్థ సభ్యుడు

ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న ఈరోజుల్లో ఇలాంటి సేవా సంస్థలు పేదలకు బాసటగా నిలుస్తున్నాయి. ఆపన్న హస్తం అందిస్తూ ఆదుకుంటున్నాయి. పలు సేవా కార్యక్రమాలతో సమాజానికి సేవ చేస్తూ.. మానవత సంస్థ సభ్యులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకా మానవత్వం బతికే ఉందంటూ మానవత పరిమళాలను వెదజల్లుతున్నారు.

ఇదీ చదవండి : చదువుల బడికి విఘ్నాలు.. చిన్నారుల భవితపై నీలినీడలు!

ABOUT THE AUTHOR

...view details