వైకాపా తీరుతో పెట్టుబడులు రాక... ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్న ఆయన... ఏపీని మరో బిహార్‌లా మారుస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కారాగారంలో ఉన్న... దెందులూరు మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్‌ను లోకేశ్ పరామర్శించారు. కేసులకు భయపడొద్దని... తెదేపా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
5 నెలల్లో 610 కేసులు...
పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని ఇంటికి వెళ్లిన లోకేశ్... ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాకర్తలు, నాయకులపై సుమారు 610 కేసులు పెట్టారని వివరించారు. కేసుల పేరుతో బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న మంత్రి... నిరూపించాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణరెడ్డి... అండతోనే తెదేపా నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.