కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ స్నేహిత కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీసులకు ఆమె పలు సూచనలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ను పటిష్టంగా అమలు చేసే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అనవసరంగా రహదారులపై తిరిగే వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేయాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇంటికి ఒకరు చొప్పున నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు బయటకు రావాలన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేశారు.
జిల్లాలో కరోనా అనుమానిత మూడు కేసుల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. రెండు రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించగా.. వారు ఏలూరు ఆస్పత్రిలో చేరారు. వీరి ముగ్గురు రిపోర్టులు నెగెటివ్ రావడంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 11 మంది కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. వీరిలో ఏడుగురికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చంది. మిగితా నలుగురి రిపోర్ట్ రావాల్సి ఉంది. నెగెటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపివేశారు. కొద్దిరోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని వారిని హెచ్చరించారు.
చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఓ విందులో పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ వేడుకలో పాల్గొన్న డీఎస్పీ, అతని ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలగా.. అధికారులు గ్రామంలో చర్యలు చేపట్టారు. తాగునీటి ట్యాంకులు, డ్రైనేజీలు, పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర తమ ఆధీనంలోకి తీసుకుని బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌అమలులో ఉండటంతో జిల్లాలోని తణుకులో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూరగాయల మార్కెటలో పర్యటించారు. ధరలు పెంచి అమ్మితే ఎంతమాత్రం సహించబోమన్నారు. అధిక ధరలకు అమ్మితే హోల్‌సేల్ దుకాణాలను సైతం మూయించి వేయిస్తానని హెచ్చరించారు. వినియోగదారులు నేరుగా తమ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన దుకాణాలవద్దే కొనుగోలు చేయాలని సూచించారు. నాలుగు రూపాయలు తక్కువకు వస్తున్నాయనే ఆలోచన కంటే ఆరోగ్యం ముఖ్యమని అందరూ భావించాలని 21 రోజులుపాటు లాక్‌డౌన్ అమలయ్యేలా అందరూ సహకరించాలని కోరారు.