ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండుగప్పకు ప్రోత్సాహం కరువు.. ఆక్వా రైతులకు నష్టాలు - లాక్​డౌన్ ఎఫెక్ట్

ఆక్వా రైతులకు కాసులు కురుపించే పండుగప్ప చేప... ఇప్పుడు భారంగా మారింది. సరిగ్గా సీజన్​ మెుదలైన సమయంలోనే లాక్​డౌన్ విధించిన కారణంగా.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

lock down effect on aqua
లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతు

By

Published : May 14, 2020, 11:23 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం సముద్ర తీర ప్రాంతాల్లో ఆక్వా రైతులు లాక్​డౌన్​తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పు, చౌడు భూముల్లో గతంలో కాసుల పంట కురిపించిన పండుగప్ప (సీ బాస్) చేప సాగుపై లాక్​డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎదిగి వచ్చిన చేపను అమ్ముకునే వీలులేక, వాటిని పెంచేందుకు స్థోమత లేక ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ ముత్యాలపల్లి, మోడీ కాళీపట్నం, పాతపాడు తూర్పు తాళ్ళు తదితర ప్రాంతాల్లో రెండువేల ఎకరాల్లో పండుగప్పను సాగు చేస్తున్నారు. పేరుపాలెం నార్త్ లోనే సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది.

గత సంవత్సరం మే నెలలో కిలో పండుగప్ప ధర 470 నుంచి 500 వరకు పలికింది. 15 నెలల పాటు సాగు చేసే ఈ ప్రక్రియకు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడుతుంటారు ఆక్వా రైతులు. ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు సముద్ర వేట నిషేధం కొనసాగే సమయంలో ఈ రకం చేపలకు దేశ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

కరోనా దెబ్బ

కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ తో.. అన్ని రవాణా సదుపాయాలు ఆగిపోయాయి. మార్కెట్​లో ధర లేక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు 15 నుంచి 20 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు రాబడి లేదంటూ గగ్గోలు పెడుతున్నారు.

నిర్వహణ కష్టమే..

సాగుకాలంలో చెరువు నీటిలో ఏ కొద్ది మార్పులు వచ్చినా పండుగప్పలు చనిపోతాయి. అందువల్లే ఈ చేపల సాగుకు రైతు ముందుకు రావటం లేదు. పైగా మేతగా బతికి ఉన్న థిలాఫీయా చేపలు (చైనా గోరకలు) ఆహారంగా వేస్తారు. కొల్లేరులో దొరికే ఈ చేపలు గతంలో కిలో 20 రూపాయలు ఉండే వీటి ధర ఇప్పుడు 60కి పెరగటంతో ఆక్వా రైతుకు భారంగా మారింది. ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహం లేదనీ, ఇప్పటికైనా మత్స్యశాఖ అధికారులు చొరవ చూపి పండుగప్పను ఎగుమతి చేసే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

అడవి జంతువులను వేటాడుతున్న ఇంటి దొంగ

ABOUT THE AUTHOR

...view details