స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పశ్చిమగోదావరి జిల్లాలో 48 ఎంపీపీ, 48 జడ్పీటీసీ, 876 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
పశ్చిమగోదావరిలో మెుదలైన 'స్థానిక' కసరత్తు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు కావటంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు సన్నహాలు చేస్తుండగా, గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ప్రణాళిక రచిస్తోంది.
2014లో ఎన్నికలు జరిగే నాటికి జిల్లాలో 920 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. తాజాగా పది మండలాల్లో పునర్వ్యవస్థీకరణ కారణంగా 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గిపోయాయి.దీని వల్ల మిగిలిన 876 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఖరారు చేసిన రిజర్వేషన్ ప్రకారం 876 ఎంపీటీసీ, 451 స్థానాలు మహిళలకు ఖరారు చేశారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్టీలకు కేటాయించిన 31 స్థానాల్లో 18 మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన 194లో 108 స్థానాలు మహిళలకు కేటాయించారు. బీసీలకు 205 స్థానాలకు, 105 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. అన్ రిజర్వుడ్‌కు కేటాయించిన 446 స్థానాల్లో 220 స్థానాలు మహిళలకు కేటాయించారు. 48 జడ్పీటీసీ, 48 ఎంపీపీ స్థానాల్లో, 25 మహిళలకు కేటాయించగా, 23 స్థానాలు జనరల్‌కు ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా ఎస్టీలకు కేటాయించిన 5 స్థానాల్లో 3 మహిళలకు, ఎస్సీలు కేటాయించిన 11 స్థానాల్లో 6 మహిళలకు, బీసీలకు కేటాయించిన 9 స్థానాల్లో 5 మహిళలకు, అన్ రిజర్వుడుకు కేటాయించిన 23 స్థానాల్లో 11 మహిళలకు కేటాయించారు.
రిజర్వేషన్లు ఖరారు కావడం వల్ల ఆయా సామాజిక వర్గాల వారు సన్నాహాలు మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లబ్ధి పొందాలని ప్రణాళిక రచిస్తున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి, స్థానిక ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ప్రతిపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నారు.