కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో సుమారు 122 బెల్టు, బెడ్డు గ్రామాలున్నాయి. వాటిలో వంద గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానిది పైచేయిగా ఉంటుంది. వీటిలో ఇప్పటికీ 65 గ్రామాల ప్రజలు కట్టుబాట్ల ముసుగులోనే జీవిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మండవల్లి మండంలోని కొన్ని లంక గ్రామాల్లో పెద్దల పెత్తనం బయటపడుతోంది. గ్రామాల్లో సమావేశాలను నిర్వహించి పోటీ చేయాలనుకున్నవారిని బెదిరించడం మొదలైపోయింది. ప్రజల మధ్య గొడవలు, విడాకులు, ఆస్తి తగాదాలు.. ఇలా అన్నింటినీ పెద్దలే సమావేశాలను నిర్వహించి పరిష్కరిస్తుంటారు. ఎన్నికల వేళ కూడా ఫలానా వ్యక్తే మన సర్పంచిగా ఉండాలని గ్రామస్థులకు సూచిస్తారు. గ్రామంలోని ప్రజలంతా పెద్దలు ప్రతిపాదించిన వ్యక్తికే ఓట్లు వేయాల్సి ఉంటుంది.
మండవల్లి మండలం కొల్లేరు గ్రామం పులపర్రులో పెద్దలు సమావేశాన్ని నిర్వహించి గ్రామంలో ఎవరూ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయరాదని హుకుం జారీ చేశారు. తాము సూచించిన అభ్యర్థినే సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్థులను ఆదేశించారు. పెద్దల నిర్ణయంతో సర్పంచి పదవికి పోటీ పడుతున్న ఔత్సాహికుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కైకలూరు మండలం చటాకాయ గ్రామంలో గత మార్చి నెలలో సమావేశాన్ని నిర్వహించి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గ్రామంలోనే మార్కు పోలింగ్ నిర్వహించి గెలుపొందిన అభ్యర్థికి సర్పంచి పదవిని ఏకగ్రీవంగా కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తిని సర్పంచిని చేసేలా తెర వెనుక చక్రం తిప్పుతున్నారు.
స్వేచ్ఛాయుత ఓటుకు విఘాతం
కొల్లేరు లంక గ్రామాల్లో పెద్దల తీరుతో వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయలేకపోయినా.. ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయరు. అలా చేస్తే ఆ కుటుంబానికి కొల్లేరు నుంచి రావలసిన వాటాలు తొలగిస్తారు లేదా భారీగా జరిమానాలు విధిస్తారు. అందుకే విద్య, ఆర్థిక, సామాజిక, సాంకేతికపరంగా అభివృద్ధి చెందుతున్నా ఇక్కడి ప్రజలు ఇంకా పెద్దల కనుసన్నల్లోనే జీవిస్తున్నారు.
ధిక్కరించారా? అంతే సంగతులు..