పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు వేల మంది విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. ముప్పును గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు స్పందించగా 90 పాఠశాలల్లో విద్యార్థులు ఆహారాన్ని తినకుండా ఆపగలిగారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద ఉన్న ఏక్తా శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లోని 90 పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతుంది. యథావిధిగా ఇవాళ కూడా అన్ని స్కూళ్లకు భోజనాన్ని చేరవేశారు.
దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు సిద్ధమవుతుండగా పప్పులో బల్లి కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు... మిగిలిన పాఠశాలలకు సమాచారం అందించారు. 90 పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం వడ్డించలేదు. ఆ ఆహారం తిని ఉంటే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యేవారని ఉపాధ్యాయులు చెప్పారు.