ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jangareddygudem Deaths: ప్రాణాలు తీసిన 'సారా'క్షసి!.. శోకసంద్రంలో బాధిత కుటుంబాలు - జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు

ఒకే ఊరు.. మూడు నాలుగు రోజుల వ్యవధి.. 18 మరణాలు.. బాధితులందరూ సారా తాగే అలవాటున్నవారే. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా సారా తాగినవారే. కడుపులో తీవ్రమైన నొప్పి, కనుచూపు పోవటం, ఆగకుండా వాంతులు, తల తిరగటం... మృతులందరిలో దాదాపు ఇవే లక్షణాలు. శరీరం లోపల తమకేదో అయిపోతుందని... ఆసుపత్రికి తీసుకెళ్లాలని తల్లడిల్లిపోయారు. చికిత్స పొందుతూ కొందరు, ఆసుపత్రికి తరలించేలోపే మరికొందరు ప్రాణాలొదిలారు. మృతుల్లో 35-38 ఏళ్ల యువకుల నుంచి 60 ఏళ్లు దాటినవారూ ఉన్నారు. కల్తీ సారాయే తమవారిని కబళించేసిందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు మాత్రం వేరేలా ఉంటున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కొందరు, అతిగా మద్యం తాగటంవల్ల మరికొందరు మరణించారని మంత్రులు అంటున్నారు.

జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు
Jangareddygudem Deaths

By

Published : Mar 14, 2022, 4:25 AM IST

Updated : Mar 14, 2022, 7:36 AM IST

ప్రాణాలు తీసిన 'సారా'క్షసి!.. శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

Deaths in Jangareddygudem: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ నాలుగు రోజుల్లో మొత్తం 18 మంది ఒకే తరహా లక్షణాలతో మృతి చెందారు. వారిలో 15 మంది బాధిత కుటుంబ సభ్యుల్ని ‘ఈనాడు-ఈటీవీ భారత్​ ప్రతినిధి’ కలిసి మాట్లాడారు. మరో మూడు కుటుంబాలు అందుబాటులో లేవు. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు, చనిపోయిన రోజు పరిణామాలను చూస్తే కల్తీసారా తాగడంవల్లే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. నిజాల్ని వెలికి తీయాల్సిన ప్రభుత్వం.. వాస్తవాల్ని కనుమరుగు చేసేందుకే ప్రయత్నిస్తోందన్న విమర్శలు ఆ కుటుంబాల నుంచి వస్తున్నాయి.

కల్తీ సారా ప్రభావం కాదా?

ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకూ 16 మంది, 12వ తేదీన ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన రోజు వీరిలో కనిపించిన లక్షణాలు ఒకేలా ఉన్నాయి.

  • ‘మా మామయ్య బండారు శ్రీనివాసరావు (49) ఈ నెల 9వ తేదీ సాయంత్రం సారా తాగి వచ్చారు. ఆ రోజు రాత్రి 2.30 నుంచి వాంతులు మొదలయ్యాయి. గుండెల్లో మంటగా ఉందని, ఆయాసం వస్తోందంటూ ఇబ్బంది పడ్డారు. అంతలోనే ముఖమంతా నల్లగా మారిపోయింది. నాలుక తెల్లగా అయిపోయింది. నన్ను బతికించండి అంటూ ప్రాధేయపడ్డారు. తెల్లారే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఒక సెలైన్‌ పెట్టాం. రెండో సెలైన్‌ పెట్టేలోగా ప్రాణలొదిలారు. కల్తీసారా వల్లే ఆయన చనిపోయారు. ఆయనకు అనారోగ్య సమస్యలు లేవు. గతంలో సారా తాగినా ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది కాలేదు’ అని మృతుడి కోడలు సాయిప్రియ వాపోయారు.

శ్మశానం వద్ద వెలుగుచూసిన నిజం

‘మా నాన్న బంగారు ఎర్రయ్య (65) నైట్‌ వాచ్‌మన్‌. ఆయన పనులు పూర్తి చేసుకుని నాటుసారా తాగి ఈ నెల 9వ తేదీ ఉదయం ఇంటికొచ్చారు. తర్వాత కడుపులో మంట, పేగుల్లో తిప్పేస్తున్నట్లు ఉందని ఇబ్బందిపడ్డారు. కళ్లు ఎర్రగా అయిపోయాయి. నోట్లో నురగ వచ్చేసింది. వాంతులయ్యాయి. ముఖమంతా నల్లగా అయిపోయింది. తర్వాత కొద్దిసేపటికే చనిపోయారు. మేము ఆయన అంత్యక్రియల కోసం శ్మశానం వద్దకు తీసుకెళ్లాం. అక్కడ మరో 8 మృతదేహాలు ఉన్నాయి. ఆరాతీస్తే అందరూ నాటుసారా తాగటంవల్లే చనిపోయారని తేలింది. అప్పుడే మా నాన్నను కల్తీ సారా కాటేసిందని నిర్ధారణకు వచ్చాం’ అని ఎర్రయ్య కుమారుడు బంగారు శ్రీను చెప్పారు.

నా కళ్ల ముందే ..

‘మా ఆయన వంట మాస్టర్‌ వద్ద సహాయకుడు. ఈ నెల 8న పనికి వెళ్లలేదు. ఉదయం టిఫిన్‌ తిన్నాక బయటకు వెళ్లి నాటుసారా ప్యాకెట్లు తెచ్చుకున్నారు. వద్దంటున్నా నా ముందే వాటిని తాగారు. తర్వాత మధ్యాహ్నం నుంచి తనకు కళ్లు తిరుగుతున్నాయని, నీరసంగా ఉందని చెప్పారు. విరేచనాలు, వాంతులు అయ్యాయి. చెవులు, కళ్ల వద్ద నల్లగా వచ్చేసింది. కడుపులో మంట పుడుతోందని వాపోయారు. వైద్యుల వద్దకు తీసుకెళ్తే.. వారు మందు తాగే అలవాటు ఉందా? అని అడిగారు. అవునని చెప్పాను. దానివల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. కొద్దిసేపటికే ఆయన ప్రాణాలొదిలారు’ అని మృతుడు సీదిరాల పోసయ్య భార్య వెంకటలక్ష్మి తెలిపారు.

అవి తాగిన తర్వాతే... ప్రాణాలొదిలారు

‘మా అన్నయ్య ఈ నెల 9వ తేదీ ఉదయం నాటుసారా ప్యాకెట్లు తెప్పించుకుని తాగారు. ఆ తర్వాత విపరీతమైన కడుపు మంట, శ్వాస అందకపోవటం వంటి లక్షణాలు మొదలయ్యాయి. పేగులు మెలితిప్పేస్తున్నాయని వాపోయారు. ఆరోజు, ఆ రాత్రంతా ఇబ్బంది పడ్డారు. మర్నాటి ఉదయం ప్రాణాలు కోల్పోయారు. కల్తీసారాయే ఆయన్ను బలితీసుకుంది’ అని మృతుడు పితాని రమణ సోదరి వెంకటలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు.

ఇంకా మడిచర్ల అప్పారావు (46), బొంకూరి రాంబాబు (60) దేవరశెట్టి చక్రపాణి (64), బంగారు ఎర్రయ్య (65), పోలుపర్తి సత్యనారాయణ (62), చంద్రగిరి శ్రీనివాసరావు (40), సీదిరాల పోసయ్య (35), వెంపల అనిల్‌కుమార్‌ (35), కొప్పాక వెంకటేశ్వరరావు (48), సలాది ఆనంద్‌ (43), కాళ్ల దుర్గారావు (61), దోసూరి సన్యాసిరావు (38), పితాని రమణ (36) దాదాపు ఇలాంటి లక్షణాలతోనే చనిపోయారని వారు కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఏజెన్సీలో తయారుచేసి..

జంగారెడ్డిగూడెంలో నాటుసారా విక్రయాలు కుటీర పరిశ్రమలా సాగుతున్నాయి. ప్రధానంగా శ్రీనివాస థియేటర్‌ కూడలి, పాత బస్టాండు, హరిజనపేట, చెరువుగట్టు సెంటర్‌, ఉప్పలమెట్ట, పద్మా థియేటర్‌ తదితర ప్రాంతాల్లో వీటి విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా మృతి చెందిన వారంతా అంతకు కొన్ని గంటల ముందు ఆయా ప్రాంతాల్లోని కేంద్రాల వద్దే నాటు సారా తాగారని బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తయారు చేసి పట్టణంలోకి వాటిని తరలించి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వాస్తవాలు నిగ్గు తేలాలంటే.. బాధితులు సారా ఎక్కడ కొన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు చేయాల్సి ఉంది.

మిథైల్‌ ఆల్కహాల్‌ కలిసిందా?

గతంలో రాష్ట్రంలో నాటుసారా తాగి బలైన సంఘటనల్లో.. అత్యంత ప్రమాదకరమైన మిథైల్‌ ఆల్కహాల్‌ సారాలో కలవటంవల్లే చనిపోయారని తర్వాత తేలింది. జంగారెడ్డిగూడెం ఘటనలోనూ నాటి బాధితుల లక్షణాలే కనిపిస్తున్నాయి. అందువల్లే ఇక్కడా సారాలో మిథైల్‌ ఆల్కహాల్‌ కలిసి ఉండే అవకాశం కనిపిస్తోందని గతంలో ఎక్సైజ్‌శాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.

మంత్రులు ఏమంటున్నారంటే...

  • అతిగా తాగి చనిపోయారు
    ‘జంగారెడ్డిగూడెంలో వారం రోజులుగా మరణించిన వారి సంఖ్య అయిదు. వారిలో ఒకరు గుండెపోటుతో మరణించగా.. మిగతా నలుగురు అతిగా మద్యం తాగి చనిపోయారు’ - ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
  • కొవిడ్‌ అనంతర లక్షణాలే
    ‘కొవిడ్‌ అనంతర లక్షణాలు, హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, ఆస్థమా, మూత్రపిండాల వ్యాధి, కాలేయ వ్యాధి లక్షణాలతో చనిపోయారు. 13 మంది వారి ఇళ్ల వద్ద, మరో ఐదుగురు ఆసుపత్రిలో మృతి చెందారు. వీరిలో ముగ్గురికి శవపరీక్ష చేసి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు పంపించాం. ఆ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది’ - ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

ఈ ప్రశ్నలకు బదులెవరిస్తారు?

  • కలుషిత ఆహారం తినటంవల్ల మరణాలు సంభవించాయేమోనని కొన్ని ఇళ్ల నుంచి అధికారులు ఆహార నమూనాలను సేకరించారు. అదే నిజమనుకుంటే... ఆ ఇంట్లో ఉన్నవారిలో ఒక్కరు తప్ప ఎవరికీ ఇబ్బంది కలగలేదు కదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
  • కొవిడ్‌ అనంతర లక్షణాలే మరణాలకు కారణమైతే, కేవలం పురుషులు మాత్రమే ఎందుకు చనిపోయారని, మృతుల్లో ఒక్క మహిళా లేకపోవడం ఏంటని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.
  • ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు నమూనాలు పంపామని చెబుతున్న మంత్రి.. ఆ నివేదికలు రాకుండానే అవి కల్తీసారా మరణాలు కావని ఎలా చెబుతారని కుటుంబాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
  • ‘మా ఆయన మడిచర్ల అప్పారావు (46) ఈ నెల 8వ తేదీ రాత్రి నాటుసారా తాగి ఇంటికొచ్చారు. వేకువజామున 3 గంటల నుంచి వాంతులు, కడుపులో మంట, డొక్కలో నొప్పితో అల్లాడిపోయారు. దాహం వేస్తోందంటూ తల్లడిల్లిపోయారు. ఉదయం వరకూ అదే పరిస్థితి. తొలుత ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. 9వ తేదీ ఉదయం 11 గంటలకు చనిపోయారు. గతేడాదిన్నరగా ఆయన సారా తాగుతున్నారు. ఈ సారి తాగిన సారాలో కల్తీ జరగటం, ఏదో కలవటం వల్లే ఆయన చనిపోయారు’ అని మృతుడు మడిచర్ల అప్పారావు భార్య మడిచర్ల వెంకటలక్ష్మి వాపోయారు.
  • ‘మా నాన్న బొంకూరి రాంబాబు (60) 8వ తేదీ సాయంత్రం బయటకు వెళ్లి నాటుసారా తాగారు. రాత్రి 2 గంటల సమయంలో కడుపులో మంట అంటూ దొర్లేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కళ్లు మసకబారిపోయాయి. కనుగుడ్లు తేలేశారు. ఏమీ కనిపించట్లేదని ఏడ్చారు. నీళ్లు తాగినా సరే వెంటనే వాంతులు అయిపోయాయి. నోరంతా పూసుకుపోయింది. మా కళ్ల ముందే అల్లాడిపోయారు. 9వ తేదీ ఉదయం 9 గంటలకంతా ప్రాణాలొదిలేశారు. ఆయన అప్పుడప్పుడూ సారా తాగుతుంటారు. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. ఆ రోజు కల్తీసారా తాగటం వల్లే ఆయన బలైపోయారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన ఆళ్లనాని... దీర్ఘకాలిక వ్యాధుల వల్లే చనిపోయారంటూ చెప్పటం దారుణం’ అని మృతుడు బొంకూరి రాంబాబు కుమార్తె రామలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు.
  • ‘‘మా ఆయన దేవరశెట్టి చక్రపాణి (64) వంట పనిచేస్తుంటారు. ఈ నెల 10న పనికి వెళ్లారు. అక్కడ నాటుసారా తాగారు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఆయనకు కళ్లు మసకేశాయని, కనిపించట్లేదని ఆయనతో పాటు పనిచేసేవారు మాకు ఫోన్‌ చేసి.. ఆయన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కనుగుడ్లు పూర్తిగా తేలేశారు. వాంతులు అయ్యాయి. తనకు నరాలు లాగేస్తున్నాయని, భయమేస్తోందని చెప్పారు. అంబులెన్సును పిలిచే లోపే ప్రాణలొదిలేశారు’ అని మృతుడు దేవరశెట్టి చక్రపాణి భార్య దుర్గమ్మ వివరించారు.

సారా మృతుడి సోదరిపై ఒత్తిడి?

మధ్యాహ్నం ఒక మాట.. సాయంత్రం మరోమాట!

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ‘మా తమ్ముడు వెంపల అనిల్‌ కుమార్‌ అన్నం లేక చనిపోయాడని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. అలా అని మేము ఎవరికీ చెప్పలేదు. మా తమ్ముడు సారా తాగడంవల్లే చనిపోయాడు. మా తమ్ముడి కుటుంబంతోపాటు జంగారెడ్డిగూడెంలో మృతి చెందిన మిగిలిన వారి కుటుంబాలనూ ప్రభుత్వం ఆదుకోవాలి. మరణంపై కావాలని అబద్ధం చెబుతున్నారు’ అని అనిల్‌ కుమార్‌ సోదరి ఆదివారం విలేకరులతో తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ శనివారం అనిల్‌ కుమార్‌ చనిపోయిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని, మంత్రి ఉద్దేశం వేరని పేర్కొన్నారు.

  • ఇదీ చదవండి: Chandrababu Tour: నేడు జంగారెడ్డిగూడెంకు చంద్రబాబు.. నాటుసారా మృతుల కుటుంబాలకు పరామర్శ
Last Updated : Mar 14, 2022, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details