పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 8,9 తేదీలలో దేవస్థానం సిబ్బంది, స్థానిక భక్తులతో ట్రయల్ రన్ నిర్వహించగా... బుధవారం సామన్య భక్తులకు అనుమతినిచ్చింది. దీంతో స్వామివారి దర్శనం కోసం తెల్లవారు నుంచే భక్తులు క్యూలైన్ లో బారులు తీరారు.
భక్తులతో కిటకిటలాడిన ద్వారకాతిరుమల ఆలయం
సుమారు 80 రోజుల విరామం తర్వాత ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తజనం పులకించిపోయారు. అ దేవదేవుడి దర్శనం కోసం ఆలయంలో భక్తులు బారులు తీరారు. కాని కొంత మంది భక్తులు భౌతిక దూరం పాటించకపోవటంతో ఆలయ అధికారులు అదుపు చేయలేక తలలు పట్టుకోవాల్సి వచ్చింది.
భక్తులతో కళకళలాడిన ద్వారకాతిరుమల ఆలయం
ఉచిత, శీఘ్ర దర్శనం ఇలా రెండు లైన్లలో భక్తులకు దర్శనానికి అనుమతించారు. క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు మాస్కులు ధరించి భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టగా.... ప్రతి భక్తుడికి సంబంధించిన ఆధార్ కార్డును పరిశీలించి వివరాలు సేకరించారు. థర్మల్ స్కానర్ తో భక్తుల ఉష్ణోగ్రతను పరీక్షించిన తర్వాత దర్శనానికి అనుమతించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మధ్యాహ్నం భోజనం పొట్లాలను పంపిణీ చేశారు.