కొప్పర్రులో 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' ఉద్యమం..! గోడ మీద రాతలతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు వార్తల్లో నిలుస్తోంది. ఊరన్నాక గోడలు.. గోడల మీద రాతలు సహజమే కదా అనుకోకండి. ఆ ఊర్లో రాయించిన సందేశాలు... గోడల కంటే బలమైనవి. 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' అని.. గత ఎన్నికల సందర్భంగా రైతు కొంకటి కాంతారావు తన ఇంటి గోడపై పెద్ద అక్షరాలతో రాయించారు.
ఓటు కోసం నోటిస్తామంటూ వచ్చే వారికి సమాధానం చెప్పలేక ఇలా రాయించానంటున్నారు కాంతారావు. గత ఎన్నికల సమయంలో కాంతారావు ఇంటి గోడకే పరిమితమైన ఈ సందేశం ఇప్పుడు అనేక ఇళ్ల ముందు కనిపిస్తోంది.
కాంతారావు సంకల్పాన్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే ఆయన కుమారుడు చంద్రశేఖర్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఓటు ప్రాముఖ్యతను ఊరందరికీ వివరిస్తూ అందరి ఇళ్లపై 'ఓట్లు అమ్మబడవు' అంటూ రాయిస్తున్నారు. ఇందులో చిత్రకారుడు సత్యనారాయణ కూడా భాగస్వాములయ్యారు. రంగుల ఖర్చు చంద్రశేఖర్ భరిస్తుంటే సత్యనారాయణ ఉచితంగా ఇళ్ల గోడలపై రాస్తున్నారు.
ఏడొందల జనాభా ఉన్న కొప్పర్రులో ఇప్పుడు ఇదే ఉద్యమంలా మారింది. పంచాయతీ ఎన్నికల్లో డబ్బుతో ఓట్లు కొనాలనుకునేవారికి ప్రవేశం లేదని చాటి చెప్పడమే ధ్యేయం అంటున్నారు గ్రామస్థులు..!
ఇదీ చదవండీ... తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. చిత్తూరులోనే అత్యధికం