ఎక్కడికక్కడ మోహరించిన ప్రొక్లైన్లు.. అభయారణ్యంలో అడ్డగోలు తవ్వకాలు.. ఇబ్బడి ముబ్బటిగా పుట్టుకొస్తున్న చేపల చెరువులు. ఇదీ కొల్లేరులో జరుగుతన్న తాజా దురాక్రమణ. ఇదంతా ఎక్కడో కాదు. చేపల చెరువుల తవ్వకాన్ని నిషేధించిన కొల్లేరు కాంటూరు పరిధిలోనే. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీపర్రు, మానూరు, పైడిచింతపాడు యగనమెల్లి, వీరమ్మగుంట, మొండికోడు, పల్లవూరు గామాల పరిధిలో ఈ ఆక్రమణల పర్వం మూడు చెరువులు ఆరు గట్లుగా సాగిపోతోంది. శ్రీపర్రు, వీరమ్మగుంట, పల్లవూరు ప్రాంతాల్లో తవ్విన చెరువుల్ని అటవీశాఖ అధికారులు ధ్వంసం చేసినా.. రాత్రిళ్లు మళ్లీ ఆక్రమణలకు తెరతీస్తున్నారు.
ఏలూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, భీమడోలు, ఉంగటూరు, నిడమర్రు మండలాల పరిధిలోని గ్రామాల్లో.. 30 నుంచి వందెకరాల విస్తీర్ణంలో చేపల చెరువులు తవ్వుతున్నారు. ఆర్నెల్ల వ్యవధిలో.. దాదాపు 5 నుంచి 6 వేల ఎకరాల్లో ఆక్రమణలు జరిగిన ఆనవాళ్లున్నాయి. ఒక్క ప్రత్తికోళ్లలంకలోనే వెయ్యెకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వారని అంచనా. కొల్లేరు ఆక్రమణలు అడ్డుకోడానికి నిబంధనలు చాలానే ఉన్నాయి. కొల్లేరు అభయారణ్యంలో పదులకొద్దీ తవ్వే యంత్రాలుంచడం చట్టరీత్యా నేరం. ఒకవేళ యంత్రాలు తీసుకెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. అక్రమంగా ప్రొక్లైన్లు తీసుకెళ్తే సీజ్ చేసి కేసులు పెట్టే అధికారం అటవీ అధికారులకు ఉంది.