Bhadrachalam Temple Land: భద్రాద్రి రాముడి భూముల రక్షణ దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని 917 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, దేవాలయ ఈవో తదితర అధికారులకు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు సెప్టెంబర్ 14న తీర్పు ఇచ్చామని గుర్తుచేసింది. ఆ తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆక్రమణదారులకు ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకుని.. భద్రాద్రి రాముడి భూముల్లో ఆక్రమణలను తొలగించాలని అధికారులకు తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
తెలంగాణలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఏపీ పరిధిలో ఉన్న 917 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని రక్షించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ వానర సేన ఏపీ అధ్యక్షుడు, న్యాయవాది కె.మల్లికార్జునమూర్తి హైకోర్టులో పిల్ వేశారు. ఏపీ ప్రభుత్వంతోపాటు దేవస్థానం ఈవోను ప్రతివాదిగా పేర్కొన్నారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేష్‌కుమార్ వాదనలు వినిపించారు. పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రాముడికి చెందిన 917 ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నా, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.