కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ప్రజలు దర్శనాలు నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొంత సడలింపులు ఇచ్చింది. ఈ తరుణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కేశఖండన శాల సేవల నిలిపివేతపై భక్తులు ఆందోళన చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచి రోడ్డుపై ఆందోళన చేస్తున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశఖండన శాల వద్ద కనీస సౌకర్యాలు కూడా లేక ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తలనీలాల సమర్పణకు వెళ్తే.. తప్పని తిప్పలు - పశ్చిమగోదావరిలోని దేవాలయాల ప్రధాన వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కేశఖండన శాలలో సేవల నిలిపివేతపై భక్తులు ఆందోళన చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిలిపివేత ఏంటని దేవాలయ అధికారులను నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చామని ఇక్కడకు వచ్చిన తర్వాత మూసివేశారని వారు వాపోయారు. ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఆలయ ఈవో ప్రభాకర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని భక్తుల సమస్యలను తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కేశఖండనశాలను మూసి వేయడం ఏంటని ఆయన్ని నిలదీశారు. కనీసం ఈ ఒక్కరోజయినా కేశఖండన శాలను తెరవాలని భక్తులు కోరారు. ఆరోగ్య బీమా కల్పిస్తే గాని విధులకు హాజరుకామని కేశఖండన శాలలో పనిచేసే వారు చెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈవో తెలిపారు. ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేశామన్నారు. దీనిపై ఈవో స్పందించి ఒక రోజు మాత్రమే భక్తులు తలనీలాలు సమర్పించడానికి వీలు కల్పించారు. దీంతో భక్తులు ఆందోళన విరమించారు.