కార్తీక సోమవారం, నాగుల చవితిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లాల్లోని దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పూజలు చేస్తున్నారు. నరసాపురం వశిష్ట గోదావరి వలంధర ఘాట్, అమరేశ్వర ఘాట్, కొండాలమ్మ ఘాట్, లక్ష్మేశ్వరం రాజు లంక ఘాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలు వదిలారు. శైవ క్షేత్రలు శివనామ స్మరణతో మారుమోగాయి.
భక్తులు కపిల మల్లేశ్వర అమరేశ్వర ఏకాంబరేశ్వర విశ్వేశ్వర ఆలయాలతోపాటు ప్రసిద్ధ లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణేశ్వరస్వామినీ దర్శించుకొని పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించారు.
ఉండ్రాజవరంలో ప్రత్యేక పూజలు
ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తీక మాసం పర్వదినాల్లో ముఖ్యంగా సోమవారం రోజున స్వామివారిని దర్శించుకుంటే సకలశుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు.
స్వామివారికి 11వ శతాబ్దం నాటి చరిత్ర ఉంది. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో ఉరగ రాజు అనే సామంతరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజు పేరు మీదగానే ఈ గ్రామం మొదట్లో వరదరాజపురంగా తర్వాత ఉండ్రాజవరంగా మారినట్లు చెబుతారు.
ఇదీ చదవండి..:PEDASHESHA VAHANA SEVA: నేటి సాయంత్రం శ్రీవారికి పెదశేషవాహన సేవ