ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

karthika Somavaram: శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు - తూర్పు గోదావరి జిల్లాలో కార్తీక మాసం మూడో సోమవారం పూజలు

కార్తీక మాసం మూడో సోమవారం(karthika somavaram pooja) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగుతూ.. ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నదీ తీరాలు భక్తుల శివ నామస్మరణలతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు.. ఆలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

karthika somavaram pujalu
కార్తిక మాసం మూడో సోమవారం పూజలు

By

Published : Nov 22, 2021, 10:10 AM IST

Updated : Nov 22, 2021, 2:27 PM IST

కార్తిక మాసం మూడో సోమవారం పూజలు

కార్తీక మాసం మూడో సోమవారం(karthika somavaram pooja at andhra pradesh) పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఆయా దేవస్థాన పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

పశ్చిమ గోదావరి జిల్లాలోని శివాలయాలు భక్తుల శివనామస్మరణతో(Karthika masam poojas) ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తణుకు పట్టణంలో గోస్తని నదీ తీరాన వేంచేసి ఉన్న సిద్దేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పురాతన ఆలయంలో స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు చేశారు. దేవాలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. తారకాసురుడనే రాక్షసుడు.. ఈ ప్రాంతాన్ని పరిపాలించే సమయంలో అక్కడి సిద్దులు, యోగులు తన ఇష్టదైవమైన పరమశివుని ప్రతిష్టించినట్లు పురాణ కథనం. కార్తీక మాసం పర్వదినాలలో స్వామివారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.

శివ నామస్మరణలతో నదీ తీరాలు..

నదీ తీరాలు భక్తుల శివ నామస్మరణలతో మార్మోగుతున్నాయి. గోదావరిలో కార్తీక దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. నరసాపురం వద్ద వశిష్ట గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండే గోదావరి వెళ్తున్నారు. మహిళలు పుణ్య నదీ స్నానాలు ఆచరించి ఒడ్డున ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలను వదులుతున్నారు. ఈరోజు నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు నదిలో వదిలితే పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

తణుకులో కపర్థీశ్వర స్వామిని భక్తులు దర్శించికొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం పంచామృతాలతో అభిషేకం చేశారు. తణుకు పట్టణం సజ్జాపురంలోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి జల పాలాభిషేకాలు నిర్వహించారు. గోకర్ణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో ఉరగ రాజు అనే సామంతరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించినపుడు స్వామివారికి పూజలు చేసినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలో..

కేంద్ర పాలిత ప్రాంతం యానాం... ముమ్మిడివరంలో భక్తులు తెల్లవారుజాము నుంచి గౌతమి గోదావరి నదిపాయలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. వేద పండితులు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్షపత్రి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం(karthika Somavaram special) శివన్నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి వారి, అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి వారికి అభిషేకాలు, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం కింద క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

కొత్తపేట నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు. భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి.

విశాఖ జిల్లాలో..

విశాఖలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రోలుగుంట మండలంలో బూచంపేట గ్రామంలోని కైలాసగిరి కొండ మీద తెల్ల వారుజామునుంచే భక్తులు పూజలు చేస్తున్నారు. భక్తితో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దీపాలను వెలిగించేదుకు అవసరమైన నూనెను ఆలయ కమిటీ ఉచితంగా సరఫరా చేసింది. గ్రామ సర్పంచ్ వులబల చంద్ర- రాము దంపతులు ప్రత్యేక వ్రతాలు నిర్వచించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లాలోని శివాలయాలు.. శివనామస్పరణలతో మారుమ్రోగుతున్నాయి. వేకువజాము నుంచే నాగావళి, వంశధార నదీ పరీవాహక ప్రాంతాల్లోని పలు రేవుల్లో భక్తులు స్నానమాచరించి నదిలో దీపాలు విడిచిపెట్టారు. దక్షిణ కాశీగా పేరోందిన శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామి, కార్తిక కైలాసంగా పేరుగాంచిన రావివలస శైవక్షేత్రం... ఎండలమల్లికార్జున స్వామి, నాగావళి నదీ తీరంలోని ఉమారుద్రకోటేశ్వరస్వామి ఆలయాల్లో క్షీరాభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శివాలయాల్లో మహిళలు దీపారాధన చేశారు. జిల్లాలోని శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి.

ఇదీ చదవండి..:AMARAVATHI PADAYATRA: అదే జోరు...అదే హుషారు...ఉవ్వెత్తున్న సాగుతున్న మహాపాదయాత్ర

Last Updated : Nov 22, 2021, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details