Nadendla Manohar meeting: వైకాపా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం యత్నిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను తిట్టేందుకే రాజమహేంద్రవరంలో వైకాపా ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారని చెప్పారు. వైకాపా మంత్రులు.. ఆయా శాఖలకు ఏయే మంచి పనులు చేశారో చెప్పకుండా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను చదివి వినిపించారని ఎద్దేవా చేశారు.
జనసేన ఆవిర్భావ సభకు భూమి ఇచ్చిన గ్రామస్థులతో సమావేశమైన నాదెండ్ల మనోహర్.. జనసేన అధినేత పవన్ రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారని... ఆ నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను వైకాపా నేతలు పడగొట్టి.. మళ్లీ కట్టించి వైఎస్ పేరు పెట్టారని గ్రామస్థులు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. మనోహర్ మాట్లాడుతుండగా పవర్ కట్ కావడంతో గ్రామస్థులు, పార్టీ కార్యకర్తల సెల్‌ఫోన్ వెలుగులో ప్రసంగం కొనసాగించారు. ఆయన మాట్లాడటం పూర్తవగానే కరెంట్ రావడం గమనార్హం.
జగన్మోహన్ రెడ్డి భజన: పోతిన వెంకట మహేష్
రాజమండ్రిలో వైకాపా కాపు నేతల మీడియా సమావేశం జగన్మోహన్ రెడ్డి భజన కార్యక్రమంలా మారిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాపుల అభివృద్ధి కంటకుడిగా మారిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైకాపా కాపు నేతలు ఎందుకు కాపు గాస్తున్నారో వారికే తెలియదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు తట్టుకోలేక హడావుడిగా ఇవాళ రాజమండ్రిలో వైకాపా కాపు నేతలు సమావేశం నిర్వహించారని తెలిపారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి.. అధికార కాంక్షతో సీఎం జగన్ మోహన్ రెడ్డి విడగొట్టి విభజించి పరిపాలిస్తున్నారని మహేష్ మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నేతలపై తుని సంఘటన కేసులు ఎత్తివేశామని చెప్పుకునే వైకాపా నేతలు.. మరి ముద్రగడ పద్మనాభం మిగిలిన నేతలు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని, వంగవీటి మోహన రంగా హత్య కేసులో లోకం మొత్తం చెప్పుకునే నాయకుడి కొడుకు వైకాపాలోనే ఉన్నారు కదా అని విమర్శించారు.
ఇవీ చదవండి: